
నేడు ‘చలో దగ్గులూరు మెడికల్ కాలేజ్’
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ శుక్రవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా జిల్లా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చలో దగ్గులూరు మెడికల్ కాలేజీ జిల్లాస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) తెలిపారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో గుడాల గోపి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో మంత్రి ఉన్నా మెడికల్ కాలేజీని ప్రైవేటుపరం చేస్తానంటే ఏమీ మాట్లాడకపోవడం దురదృష్టకరం అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పంతో పాలకొల్లుకు వచ్చిన వైద్య కళాశాలను నిలబెట్టుకోకుండా, ప్రైవేటుపరం చేస్తానన్న సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని ప్రశ్నించలేని దుస్థితిలో మంత్రి ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. వనరులు తీసుకురాలేరు, ఉన్న వనరులను అభివృద్ధి చేయలేరని మరోసారి కూటమి నాయకులు నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో పాలకొల్లులో వైఎస్సార్‌సీపీ గెలవకపోయినా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాజీ సీఎం జగన్ రూ.475 కోట్లతో పాలకొల్లు మండలం దగ్గులూరులో 60 ఎకరాల్లో వైద్య కళాశాల నిర్మాణానికి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. గతంలో పలుసార్లు మెడికల్ కళాశాల నిర్మాణ పనులు జరగడం లేదని రాద్ధాంతం చేసిన మంత్రి రామానాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా మెడికల్ కళాశాల వైపు కన్నెత్తి చూడకపోవడం దారుణమన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం ఆయనకు ఇష్టంలేదనే అనుమానం కలుగుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన చలో మెడికల్ కాలేజ్ కార్యాక్రమానికి జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ నాయకులు యడ్ల తాతాజీ, జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు సందీప్, బండి రమేష్, వీరా మల్లికార్జునుడు, రాజేష్, పాలపర్తి కృపానాథ్, చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన