
కలెక్టరేట్‌కు మార్కెట్ యార్డ్ అనువైన ప్రాంతం
భీమవరం: భీమవరంలో కలెక్టరేట్ ఏర్పాటుకు వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంతమే అన్ని విధాలుగా అనువైందని సీపీంఎ జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలనన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ నిర్మాణ సాధన కమిటీ ఆధ్వర్యంలో సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐయు, ఫార్వర్డ్‌బ్లాక్, ప్రజాసంఘాల నాయకులు భీమవరంలో కలెక్టరేట్ ఏర్పాటుకు గత ప్రభుత్వం కేటాయించిన వ్యవసాయ మార్కెట్‌యార్డులోని స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో కలెక్టరేట్ నిర్మాణానికి 20 ఎకరాలు మార్కెట్‌యార్డు ప్రాంతంలో కేటాయించగా అక్కడ కొంతమేరకు గొడౌన్ నిర్మించినా ఎక్కువ భాగం ఖాళీగా గడ్డి, చెట్లతో ఉందన్నారు. కలెక్టరేట్ ఏర్పాటుకు గతంలో ఇచ్చిన జీవో ప్రకారం భవనాలు నిర్మించడం వల్ల జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు అనువుగా ఉంటుందన్నారు. ప్రజలకు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రాంతం మార్కెట్ యార్డే తప్ప మరొకటి కాదని గోపాలన్ స్పష్టం చేశారు. సీపీఐ కార్యదర్శి చెల్లబోయిన రంగారావు మాట్లాడుతూ ప్రజలకు అనువైన ప్రాంతాన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎంసీపీఐయు, ఫార్వర్డ్‌బ్లాక్ నాయకులు మహంకాళి, దండు శ్రీనివాసరాజు, సీపీఐ, సీపీఎం నాయకులు మల్లుల సీతారాంప్రసాద్, మల్లిపూడి ఆంజనేయులు, బొక్క సత్యనారాయణ పాల్గొన్నారు.