
మంత్రి సుభాష్ నోరు అదుపులో పెట్టుకోవాలి
వీరవాసరం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలతో అవాకులు, చవాకులు పేలుతున్న కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ శెట్టిబలిజ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కవురు శ్రీనివాస్ తీవ్రంగా హెచ్చరించారు. వీరవాసరం మండలం నౌడూరు జంక్షన్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. శెట్టిబలిజ సర్టిఫికెట్ల విషయంలో రోజుకో మాట, పూటకో మాట మాట్లాడుతున్న మంత్రి సుభాష్‌కు మతిస్థిమితం తప్పిందన్న అనుమానం వస్తుందన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నేత ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే అన్నారు. అనంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకొని బీసీ వర్గాలకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లతో పాటు నామినేటెడ్ పోస్టుల్లో సైతం పెద్ద ఎత్తున న్యాయం చేశారన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో శెట్టిబలిజ సామాజిక వర్గం అత్యధికంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో అప్పటి వైఎస్సార్ హయాంలో ఎందరికో రాజకీయంగా ప్రోత్సాహాన్నిచ్చి ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేశారన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ గ్రామాల్లోనూ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బీసీలను ఐక్యం చేసి బీసీ వర్గీయులంతా వైఎస్‌ఆర్‌సీపీకి అండగా ఉండేలా చైతన్యవంతం చేస్తామని వివరించారు. రాబోయే రోజుల్లో సుభాష్‌కు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ బీసీ నాయకులు గూడూరి ఓంకారం, కోడె యుగంధర్, వీరవల్లి శ్రీనివాసరావు, కడలి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.