
బియ్యం ధరల మోత
పన్నుకు టోకరా
పాలకొల్లు సెంట్రల్: బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ఆగస్టు మొదటి వారం నుంచి క్వింటాల్‌కు ఒక్క నెలలో ఏకంగా రూ.1000 రూపాయలు ధర పెరిగింది. ధాన్యం దొరకడం లేదని రైస్ మిల్లర్లు, బ్రాండెడ్ బియ్యం అమ్మే వ్యాపారులు సాకుగా చెబుతున్నారు. అయితే బియ్యం ధరలు కావాలనే పెంచుతున్నారని విమర్శలు వస్తున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేని విధంగా రైస్‌మిల్లర్లు, ట్రేడర్లు ఇష్టానుసారం ధరలు పెంచేసి ప్రజల అవసరాన్ని అవకాశంగా మలుచుకుంటున్నారు.
భగ్గుమంటున్న బ్రాండెడ్ ధర
మార్కెట్‌లో సోనా, హెచ్‌ఎంటీ, ఆర్‌ఎన్‌ఆర్ సోనా రకాల్ని ఆగస్టు మొదటి వారం నుంచి బ్రాండెడ్ కంపెనీలు క్వింటాల్ రూ.4000 నుంచి రూ.4200 వరకూ విక్రయించారు. ఆగస్టు 23 నాటికి బ్రాండెడ్ కంపెనీలు రూ.4,800, అన్‌బ్రాండెడ్ రూ.4,250కి అమ్మారు. సెప్టెంబర్ 1 నాటికి బ్రాండెడ్ బియ్యం టన్ను రూ.5,000, అన్ బ్రాండెడ్ రూ.4,350, సెప్టెంబర్ 8కి బ్రాండెడ్ రూ.5,200, అన్ బ్రాండెడ్ రూ.4,650కి అమ్ముతున్నారు. ఒక్క నెలలో క్వింటాల్ సుమారు రూ.1000 వరకూ పెరిగింది. దీన్ని బట్టి రైస్‌మిల్లర్లు, వ్యాపారులు ఎంత ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారో అర్ధమవుతుంది. మున్ముందు ధరలు పెరుగుతాయోనని వినియోగదారులు, మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
బియ్యం ధరలు నియంత్రించాలి
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 380 మంది వరకూ రైస్‌మిల్లులు ఉన్నారు. వీరిలో కొందరు మాత్రమే ప్రైవేటు వ్యాపారం చేస్తుంటారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, మిర్యాలగూడ, ఖమ్మం, కోదాడ, నెల్లూరు, కర్ణాటక, బళ్లారి, సిరిగుప్పల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో బియ్యం ప్రైవేటు వ్యాపారాలు చేస్తుంటారు. మన ప్రాంతంలో 90 శాతం తూర్పుగోదావరి జిల్లా మండపేట, గొల్లప్రోలు, పెద్దాపురం ప్రాంతాల నుంచి బ్రాండెడ్ బియ్యం సరఫరా చేస్తున్నారు. అధిక ధరలపై వినియోగదారులు స్థానిక వ్యాపారులను ప్రశ్నిస్తున్నా తాము ఏం చేయలేమని రైస్ మిల్లర్లు, ట్రేడర్లు పెంచుతున్న ధరలకు తమ మెయింట్‌నెన్స్ నిమిత్తం రూ.50 నుంచి రూ.100 వరకూ వేసుకుని విక్రయిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆకాశాన్ని అంటుతున్న బియ్యం ధరలను నియంత్రించేలా చర్యలు చేపట్టాలని వినియోగదారులు, మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి.
గతంలో కొందరు రైస్ మిల్లర్లు, ట్రేడర్లు ప్రభుత్వానికి తెలివిగా పన్ను చెల్లించకుండా టోకరా వేసేశారు. బ్రాండెడ్ రైస్‌కు ట్యాక్స్‌లు చెల్లించాల్సి వస్తుందని బ్రాండ్‌కు ముందు ట్యాగ్‌లైన్ తగిలించి పేరు మారినట్లు చూపి పన్నులు ఎగవేసేవారు. ఓ వ్యాపారి బియ్యం ప్యాకింగ్‌పై అంతవరకూ నాగవల్లి అని బ్రాండ్ ఉంటే పన్ను ఎగ్గొట్టడానికి దానిని పి.కె.నాగవల్లిగా మార్చి పన్ను చెల్లించకుండా వ్యాపారాన్ని కొనసాగించేవారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బ్రాండ్‌తో సంబంధం లేకుండా కేజీ నుంచి 25 కేజీల వరకూ ప్యాకింగ్ ఉన్న ప్రతి బ్రాండ్‌కు 5 శాతం జీఎస్టీ విధించింది. దీంతో వ్యాపారులు కొత్త ఎత్తుగడతో పన్నుకు ఎగనామం పెడుతున్నారు. బియ్యం బస్తాను 25, 50 కేజీలు ప్యాకింగ్ చేసేవారు. తరువాత 5, 10, 25 కేజీలుగా ప్యాకింగ్‌లు చేస్తూ విక్రయించేవారు. 5 శాతం పన్ను నుంచి తప్పించుకోడానికి కొంతకాలంగా 26 కేజీలు, 30 కేజీల ప్యాకింగ్‌లు చేస్తున్నారు. 25 కేజీలు ప్యాకింగ్ దాటితే పన్ను లేదు. ఒకవైపు పన్ను ఎగ్గొడుతున్నా బియ్యం ధరలు మాత్రం తగ్గించకపోవడం గమనార్హం. వీటిపై అధికారులు దృష్టి పెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
రైస్ మిల్లర్లు, వ్యాపారుల ఇష్టారాజ్యం
నెల రోజుల్లో క్వింటాల్‌కు రూ.1000 పెరుగుదల
మరోవైపు 26, 30 కేజీల ప్యాక్‌లతో పన్ను ఎగనామం

బియ్యం ధరల మోత