
ఆక్రమణలను అడ్డుకున్న అటవీ అధికారులు
చాట్రాయి: మండలంలోని పోతనపల్లికి చెందిన గిరిజనులు శనివారం అటవీ భూములను ఆక్రమించుకునే యత్నాన్ని ఫారెస్టు అధికారులు అడ్డుకున్నారు. సుమారు 60 మంది ఉదయం అడవిలో తుప్పలు కొడుతుండగా సమాచారం అందుకున్న అధికారులు అడ్డుకోవడంతో గిరిజనులు, అధికారుల మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. తమ్మిలేరు వల్ల తమ భూములు కోల్పోయామని వాటికి ప్రత్యామ్నాయంగా ముంపు భూములను సాగు చేసుకుంటామని చెప్పగా తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు అధికారులు ఫారెస్టు అధికారులు జాయింట్ సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అంతవరకు ఆక్రమణలు చేపట్టవద్దని సూచించారు. ప్రభుత్వ అనుమతి ఇస్తే వనసంరక్షణ సమితి ఏర్పాటు చేసి ఆదాయం కలిగేలా చేస్తామని ఫారెస్టు అధికారులు గిరిజనులకు చెప్పారు. అనంతరం కొంత మందిపై ఆక్రమణలు చేసినందుకు స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు ఫారెస్టు అధికారి సత్యనారాయణ తెలిపారు.
కొయ్యలగూడెం: అచ్చుతాపురం వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై వి.చంద్రశేఖర్ వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన నల్లమాటి రాంబాబు (58) కొయ్యలగూడెం వ్యాపారం నిమిత్తం వచ్చి తిరిగి రాజమండ్రి వైపు వెళుతుండగా గోపాలపురం మండలం బుచ్చంపేట నుంచి కొయ్యలగూడెం వైపు బైక్‌పై తల్లితో వస్తున్న తామా శ్రీరామ్ ఢీకొట్టాడు. రాంబాబు తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 108 సిబ్బంది చేరుకొని గాయపడిన శ్రీరామ్, అతని తల్లిని కొయ్యలగూడెం పీహెచ్‌సీకి, అక్కడ నుండి జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ కి తరలించారు.
ఏలూరు రూరల్: ఈ నెల 16న ఏలూరు జిల్లా బాల బాలికల జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు చేపట్టనున్నామని ఏలూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి రంగారావు, అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. వట్లూరు సర్ సీఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో మధ్యాహ్నం 2 గంటలకు ఎంపిక జరుగుతుందన్నారు. 2006 జనవరి 1 తర్వాత పుట్టిన వారే పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు 99519 31133 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.
పెనుగొండ: తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్సై కొప్పిశెట్టి గంగాధర్ తెలిపారు. శనివారం రాత్రి మాట్లాడుతూ పెనుగొండ ఎంఎస్‌ఆర్ నగర్‌లో బిక్కవోలు కేశవ రామాచార్యులు ఈ నెల 9న ఇంటికి తాళం వేసి పొరుగూరు వెళ్లారని 13న వచ్చే సరికి తలుపులు, బీరువా తలుపు బద్దలు కొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. రెండు కాసుల బంగారం, 400 గ్రాముల వెండికాయిన్స్ మాయమవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు.
నర్సాపురం రూరల్: నరసాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రుస్తుంబాద గ్రామ సమీపంలో నరసాపురం ప్రధాన కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు రూరల్ ఎస్సై సురేష్ తెలిపారు. శుక్రవారం గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. మృతురాలి ఒంటిపై ఎరుపు రంగు చీర, తెల్ల చుక్కల డిజైన్ గచ్చకాయ రంగు జాకెట్ ఉందన్నారు. వివరాలు తెలిస్తే 94407 96616 నెంబరులో సంప్రదించాలని తెలిపారు.
చింతలపూడి: విజిలెన్సు, రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు శనివారం చింతలపూడి మండలంలోని ఎరువులు షాపులను తనిఖీ చేశారు. మండలంలోని సీతానగరంలో గణేష్ ట్రేడర్స్, శ్రీ లక్ష్మి ట్రేడర్స్ షాపుల్లో తనిఖీ చేయగా రూ.15,67,650 విలువ కలిగిన 64.5 టన్నుల ఎరువులు తేడా ఉన్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేశారు. షాపు యజమానులపై కేసులు నమోదు చేసినట్లు ఏఓ మురళీ కృష్ణ తెలిపారు.

ఆక్రమణలను అడ్డుకున్న అటవీ అధికారులు