
వర్జీనియా అధరహో
వేలం కేంద్రం వారీగా ధరలు (కిలోకు రూ.లలో)
● రికార్డు స్థాయిలో ధర
● కిలోకు అత్యధికంగా రూ.418
● కంపెనీలకు ఆర్డర్లతో రైతులకు ఊరట
జంగారెడ్డిగూడెం: వర్జీనియా పొగాకుకు రికార్డుస్థాయి లో ధర పలికింది. కిలోకు రూ.418 అత్యధిక ధర లభించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఐ దు వేలం కేంద్రాలు ఉండగా, జంగారెడ్డిగూడెం–2, కొయ్యలగూడెం కేంద్రాల్లో కిలోకు రూ.418, జంగారెడ్డిగూడెం–1లో రూ. 417, దేవరపల్లి, గోపాలపురం కేంద్రాల్లో రూ.416 అత్యధిక ధర లభించింది. ఇక కనిష్ట ధర జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం కేంద్రాల్లో కిలోకు రూ.200 రాగా గోపాలపురం, దేవరపల్లిలో రూ.140 లభించింది.
గతేడాది రూ.411 : గతేడాది అత్యధికంగా కిలో కు రూ.411 ధర లభించగా, ఎన్‌ఎల్‌ఎస్ సరిధిలో సరాసరి ధర కిలోకు రూ.300 దక్కింది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు ఉత్తర ప్రాంత తేలిక నేలల్లో (ఎన్‌ఎల్‌ఎస్) పరిధిలో సరాసరి ధర రూ.296.57 లభించింది. ఇదిలా ఉండగా అత్యధిక ధర రూ.418 నంబర్–1 పొగాకుకు దక్కింది. లోగ్రేడ్ పొగాకుకు సరైన ధర లేదు. లోగ్రేడ్‌కు కూడా మంచి ధర లభిస్తేనే సరాసరి ధర పెరిగి రైతులకు లాభం చేకూరుతుంది. ఇదే ఆశతో వర్జీనియా రైతులు ఎదురుచూస్తున్నారు. కిలోకు సరాసరి ధర రూ.330 రావాలని ఆశిస్తున్నారు.
ఆల్‌టైం హైకు చేరి.. వారం రోజులుగా నిలకడగా కిలోకు రూ.350 లభించిన ధర క్రమేపీ పెరుగుతూ శుక్రవారం ఆల్‌టైం హైకు చేరుకుంది. గతేడాది కంటే రూ.7 అదనంగా పలికింది. ఆయా కంపెనీలకు విదేశీ ఎగుమతుల ఆర్దర్లు రావడమే ధర పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. దీంతో కంపెనీలు పోటీ పడి బిడ్ వేస్తున్నాయి. మొన్నటివరకు సిండికేట్ అయ్యి తక్కువ ధరకు కొనుగోలు చేయగా, ప్ర స్తుతం పోటీపడి మరీ కొంటున్నారు. అంతేకాక ఎన్‌ఎల్‌ఎస్‌లో పండిన వర్జీనియా పొగాకుకు సిగరెట్ తయారీలో సుగంధ ద్రవ్యంగా పరిగణిస్తారు. గతేడాది దేశీయ పొగాకుకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అప్పట్లో మంచి ధర లభించింది. అలాగే గతేడాది బ్రెజిల్, జింబాబ్వేలో ఉత్పత్తి తగ్గింది. మనకు బ్రెజిల్, జింబాబ్వేలు ఎగుమతుల్లో ప్రధాన పోటీగా ఉన్నాయి. ఈ ఏడాది ఆయా దేశాల్లో కూడా పొగాకు ఉత్పత్తి బాగానే ఉందని చెబుతున్నారు. అలాగే రాష్ట్రంలో కూడా ఈ ఏడాది ఎక్కువ పంటను రైతులు పండించారు. ఎల్‌ఎల్‌ఎస్ పరిధిలోనూ నిర్దేశిత పంట కన్నా ఎక్కువగానే పండించారు.
వేలం కేంద్రం గరిష్ట కనిష్ట సరాసరి
జంగారెడ్డిగూడెం–1 417 200 298.60
జంగారెడ్డిగూడెం–2 418 200 296.58
కొయ్యలగూడెం 418 200 296.38
గోపాలపురం 416 140 300.00
దేవరపల్లి 416 140 290.37