
యూరియాపై వాస్తవాల వక్రీకరణ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): యూరియాపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రకటన అవాస్తవమని, వా స్తవాలను వక్రీకరిస్తున్నారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ గురువారం ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని, రైతులకు పుష్కలంగా యూరియా సరఫరా చేస్తున్నామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన అవాస్తవం అన్నారు. వాస్తవాలు పరిశీలించకుండా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అవసరాలకు మించి యూరియా ఉందని అధికారులు చెబుతున్నారని, వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి క్యూలో నిలవాల్సిన దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. యూరియా సమస్య ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు యూరియాను దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు యూరియాను బ్లాక్ మార్కెట్లకు తరలించి బస్తాకు రూ.100, డీఏపీ రూ.200లు అధికంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. అక్రమ నిల్వలపై తనిఖీలు లేవని, అధికారులు బ్లాక్ మార్కెట్ల నుంచి వచ్చే కమీషన్లకు లొంగి సరైన చర్యలు చేపట్టడం లేదన్నారు. రైతులకు యూరియాను సరఫరా చేయలేనంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 8న రైతు సమస్యలపై జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ధ ధర్నా నిర్వహించనున్నామని, రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు.