
ఆక్వా వర్సిటీ నిర్మాణంపై నిర్లక్ష్యం
నరసాపురం రూరల్: ఆక్వా యూనివర్సిటీకి సొంత భవనాలు, క్యాంపస్ ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కౌరు పెద్దిరాజు విమర్శించారు. గురువారం ఆ పార్టీ ఆధ్వర్యంలో ఆక్వా యూనివర్సిటీ విద్యార్థులకు ప్ర స్తుతం తరగతులు నిర్వహిస్తున్న లక్ష్మణేశ్వరం తు పాను రక్షిత భవనం వద్ద ధర్నా చేశారు. పెద్దిరాజు మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ఆక్వావర్సిటీకి నిర్మాణ పనులు చురుగ్గా చేపట్టకుండా విద్యార్థులకు తుపాను షెల్టర్ భవనంలో తరగతులు నిర్వహించడం సరైంది కాదన్నారు. ఇరుకు గదుల్లో విద్యాబోధన, హాస్టల్ లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వర్సిటీ కోసం ప్రభుత్వం కేటాయించిన 50 ఎకరా ల స్థలంలో శాశ్వత భవనాలు ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు. ఆక్వావర్సిటీ నిర్మాణంపై ప్రభు త్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. యూనివర్సిటీ నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మండల కార్యదర్శి జల్లి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.