అక్రమ ఆయుధాలు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

అక్రమ ఆయుధాలు స్వాధీనం

Aug 6 2025 6:18 AM | Updated on Aug 6 2025 6:18 AM

అక్రమ ఆయుధాలు స్వాధీనం

అక్రమ ఆయుధాలు స్వాధీనం

పెనుమంట్ర: ఎస్పీ ఆదేశాల మేరకు పెనుమంట్ర ఎస్సై కె స్వామి తన సిబ్బందితో పొలమూరులో ఆక్వా చెరువుల వద్ద తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 5 నాటు తుపాకులు, 10 కిలోల గన్‌పౌడర్‌, 3 కిలోల గోళీలు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై స్వామి తెలిపారు. ఆక్వారైతులు ఎవరైనా అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే వాటిని వెంటనే పోలీసులకు అప్పగించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ఆర్‌.విజయ్‌కుమార్‌ హెచ్చరించారు.

ఆక్వా జోన్‌ సర్వే పూర్తి చేయాలి

భీమవరం (ప్రకాశంచౌక్‌): ఆక్వా జోన్‌ సర్వేలో నిబంధనలు కచ్చితంగా పాటించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ చాంబర్‌లో మంగళవారం మత్స్య, గృహ నిర్మాణ శాఖలపై సమీక్షించారు. నాచు పెంపకం (సీవీడ్‌) పై ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు నిపుణులతో శిక్షణ ఇప్పించి ప్రోత్సహించాలని, ఈ కార్యక్రమాన్ని రెండు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. సమృద్ధిగా పండే వ్యవసాయ భూమిని ఆక్వా జోన్‌లోకి ప్రతిపాదించవద్దని అధికారులకు సూచించారు.

క్రమబద్ధీకరణకు గడువు పొడిగింపు

ఏలూరు(మెట్రో): అనధికార లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ నిబంధనల ప్రకారం గడువు పొడిగించామని జేసీ పి.ధాత్రిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు జూన్‌ 30, 2025 లోపు దరఖాస్తుచేసి క్రమబద్ధీకరించుకోవాలని కోరారు. సదరు క్రమబద్ధీకరణ రుసుం 45 రోజుల్లో చెల్లిస్తే 10 శాతం రాయితీ, తదుపరి 90 రోజుల్లో చెల్లిస్తే 5 శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 99668 48055 నెంబరులో సంప్రదించాలన్నారు.

అంగన్‌వాడీలపై వేధింపులు ఆపాలి

ఏలూరు (టూటౌన్‌): ఫోన్లను అంగన్‌వాడీ కార్యాలయంలో అప్పగించిన వారిపై వేధింపులు మానుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌. లింగరాజు, ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడి ప్రసాద్‌ విజ్ఞప్తి చేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు తమ ఫోన్‌లను ఐసీడీఎస్‌ కార్యాలయాల్లో అప్పగించారన్నారు. ఫోన్లు పనిచేయడం లేదని చెప్పినా వినకుండా టార్గెట్ల పేరుతో తీవ్రంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెట్‌ సిగ్నల్స్‌ లేకపోవడం, సర్వర్‌ పనిచేయకపోవడం వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారుల బెదిరింపులకు అంగన్‌వాడీలు లొంగరన్నారు. సమస్య సానుకూలంగా పరిష్కరించాల్సిన అధికారులు ఇంతవరకూ స్పందించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తక్షణమే అంగన్వాడీలకు 5 జీ ఫోన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అన్ని యాప్‌లను కలిపి ఒక యాప్‌గా మార్చాలని, ఇతర సమస్యలు పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పుస్తకాల కోసం

ఉరుకులు పరుగులు

దెందులూరు: ప్రభుత్వ తాజా ఆదేశాలపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే యాప్‌లతో ఇబ్బంది పడుతున్న తమకు బోధనకు సమయం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం ఏలూరు సుబ్బమ్మ దేవి పాఠశాలకు వెళ్లి విద్యార్థుల పుస్తకాలు తీసుకెళ్లాలని ఫోన్‌లకు మెసేజ్‌లు పంపారు. పాఠశాల పనివేళల్లో పుస్తకాలు మోయడానికి ఉపాధ్యాయులను కేటాయించడం ఏంటని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో వాహనాల ద్వారా మండలంలో ఒక సెంటర్‌ను ఏర్పాటు చేసి ఆ సెంటరుకు పుస్తకాలను సరఫరా చేసేవారు. ఆ కేంద్రం నుంచి ఉపాధ్యాయులు వెళ్లి తెచ్చుకునేవారు. ఇప్పుడు ఆ పద్ధతికి స్వస్తి చెప్పి జిల్లా కేంద్రానికి వెళ్లి పుస్తకాలు తెచ్చుకోమనడంపై మండిపడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో సింగిల్‌ టీచర్‌ పనిచేస్తున్నారని.. ఉన్న ఒక్క టీచరు పుస్తకాలు తేవడానికి జిల్లా కేంద్రానికి వెళ్తే విద్యార్థుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదేశాలు పాటించకపోతే మళ్లీ ఏం చేస్తారో అని తప్పని పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాలపై ఏలూరు వెళ్లి పుస్తకాలు తీసుకువచ్చామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పుస్తకాలు తీసుకోవడానికి ఏలూరు రమ్మని మెసెజ్‌లు ఇచ్చిన సంగతి వాస్తవమేనని ఏలూరు రూరల్‌ మండలం ఎంఈఓ అరుణ్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement