
న్యాయం జరిగే వరకూ పోరాటం
ఉండి: మండలంలోని పాములపర్రు దళిత శ్మశాన వాటికలో ఆక్వా రైతుల కోసం రోడ్డు వేయాలనే నిర్ణయంపై వివాదం రోజు రోజుకు ముదురుతోంది. శుక్రవారం మాల మహానాడు సంఘాలు, కేవీపీఎస్, సీపీఎం, అంబేడ్కర్ ఎంప్లాయిస్ యూనియన్, అంబేడ్కర్ మిషన్ వంటి సంఘాల నాయకులు పాములపర్రు దళితులను పరామర్శించి శ్మశాన వాటికను పరిశీలించారు. పాములపర్రు ఘటనపై పోలీసుల దౌర్జన్యాన్ని వారు తీవ్రంగా ఖండించారు. శ్మశానం జోలికి ఎవరు వచ్చినా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఎమ్మెల్యేకు ఎందుకింత కక్ష?: దళిత సంఘాల నేతలు
స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు దళితులపై ఎందుకంత కక్ష అని వారు ప్రశ్నించారు. కార్యాలయంలో కూర్చుని ఆదేశాలివ్వడం కాదని శ్మశాన వాటికకు వచ్చి చూస్తే రోడ్డు ఎవరికోసం వేస్తున్నారో అర్థమవుతుందని అన్నారు.ఎవరో ఇద్దరు ఆక్వారైతుల కోసం రోడ్డు వేయిస్తూ వందల మంది దళితులను ఎందుకు బాధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 150 ఏళ్ల నుంచి గ్రామంలో దళితుల శ్మశాన వాటిక భూమిని ఇప్పుడు కాదంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రతి దళిత పేటకు రెండెకరాల వరకు భూమి ఇవ్వాలని ప్రభుత్వ జీవో చెబుతుంటే ఇప్పుడు ఆ భూమిలో రోడు వేస్తామనడంపై మండిపడ్డారు. ప్రభుత్వ రికార్డులను మాలమహానాడు నాయకులు అడుగుతుంటే సర్వే, రెవెన్యూ శాఖాధికారులు ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరు ఇలాగే ఉంటే ఉద్యమం తీవ్రతరం కాక తప్పదని వివిధ సంఘాల నాయకులు హెచ్చరించారు. సామరస్యంగా సమస్య పరిష్కారం కావాలంటే ముందుగా 144 సెక్షన్ ఎత్తేసి పోలీసులు వెళ్లిపోవాలని వారు డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్, జిల్లా అధ్యక్షుడు గుండు నగేష్, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్‌కుమార్, దానం విద్యాసాగర్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే క్రాంతిబాబు, జిల్లా అధ్యక్షుడు విజయ్, సీపీఎం జిల్లా నాయకుడు ధనికొండ శ్రీనివాస్, అంబేడ్కర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మధు, ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్, అంబేడ్కర్ మిషన్ నియోజవకర్గ నాయకులు ఉన్నారు.
మండల వ్యాప్తంగా 144 సెక్షన్
దళితులపై దాడులే జరగలేదంటూ స్థానిక ఎమ్మెల్యే బుకాయిస్తున్నా ఉద్యమ తీవ్రతను ముందుగానే పసిగట్టిన పోలీసు ఉన్నతాధికారులు పాములపర్రు గ్రామంలోనే కాకుండా మండల వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు మండలంలో ప్రచారం చేయించారు. పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను కూటమి నాయకులు చేస్తున్నారని దళితులు ఆరోపిస్తున్నారు.
దళితులకు వేధింపులు
144 సెక్షన్ సాకుతో ఇతర గ్రామాల నుంచి దళితులు పాములపర్రు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై పోలీసులు, కూటమి నాయకులు దృష్టి సారించారు. పాములపర్రు దళితుల ఫోన్ నెంబర్లు సంపాదించి వారికి ఫోన్‌లు చేస్తూ మీ మీద ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారు.. ఇక మీ పని అయిపోయిందని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా కొందరు దళితులకు ఫోన్ చేసి ఎవరివైనా పది పేర్లు చెప్పాలని.. లేదంటే ఏ1గా నీ పేరు పెట్టాల్సి ఉంటుందని ఇబ్బందిపెడుతున్నారంటూ గ్రామానికి చెందిన కొందర దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దళిత శ్మశాన వాటికలో రోడ్డు వేస్తారా?
పాములపర్రులో దళిత సంఘాల నేతల ఆగ్రహం
కూటమి నాయకులు, పోలీసుల మైండ్‌గేమ్