
12న వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ సమావేశం
కై కలూరు: వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశ పోస్టర్‌ను పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) శుక్రవారం అవిష్కరించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తేర ఆనంద్ మాట్లాడుతూ ఈ నెల 12న కండ్రికగూడెం సుఖీభవ కల్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. సమావేశానికి పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్.సుధాకర్‌బాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మరి కనకారావు, ఇతర రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు విచ్చేస్తారన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్ బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్ గురునాథం, దేవదాసు ప్రేమబాబు, యూత్ నాయకులు కోడిచుక్కల నాగశేషు తదితరులు పాల్గొన్నారు.
విద్యాశక్తిపై నిర్బంధం తగదు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యాశక్తి కార్యక్రమాన్ని నిర్బంధం చేయడం తగదని స్కూల్ టీచర్స్ అసోసియేషన్(ఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కాడిశెట్టి శ్రీనివాసులు అన్నారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జీజేఏ స్టీవెన్‌తో కలిసి ఏలూరులోని జీజె రెసిడెన్సీలో జరిగిన ఏలూరు జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాశక్తి కార్యక్రమం ఐచ్ఛికంగా నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ తెలిపారని, కొన్ని జిల్లాల్లో విద్యాశక్తి కార్యక్రమాన్ని నిర్బంధంగా నిర్వహించమనడం సబబు కాదన్నారు. విద్యార్థులు సాయంత్రం నాలుగు గంటలకు అలసిపోతారని, ఆ సమయంలో విద్యాశక్తి అని చెప్పి అదనంగా తరగతులు నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. విద్యాశక్తిపై ఎవరినీ నిర్బంధం చేయవద్దన్నారు. చాలామంది ఉపాధ్యాయులు అదనపు తరగతులు నిర్వహించి వారి సిలబస్‌ను పూర్తి చేసి వెనుకబడిన విద్యార్థులకు రెమిడియల్ తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం దాటినా పీఆర్సీ, డీఏల ఊసెత్తకపోవడం దారుణమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులు పెట్టి సంవత్సరాలు గడుస్తున్నా చెల్లింపులు చేయకపోవడం సమంజసం కాదన్నారు. కార్యక్రమానికి ఏలూరు జిల్లా అధ్యక్షుడు కాటి వెంకటరమణ అధ్యక్షత వహించగా, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట ప్రసాద్, గౌరవ అధ్యక్షుడు ఉర్ల గంధర్వరావు, అసోసియేట్ అధ్యక్షుడు పిట్ట ఫెడ్రిక్ బాబు, మహిళా అధ్యక్షురాలు జీ సంధ్యారాణి, సీనియర్ నాయకులు కే బాలరాజు, టీ అంజిబాబు, దాసరి యేసు పాదం, కే జేమ్స్, డీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
ద్వారకాతిరుమల: మండలంలోని జి.కొత్తపల్లిలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసిన ఓ ఇంటిపై సివిల్ సప్లై అధికారులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. దాడిలో రూ. 1.50 లక్షలు విలువైన 3,750 కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన మాటూరి దుర్గారావు జి.కొత్తపల్లి గ్రామంతో పాటు, చుట్టుపక్కల గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి.. బియ్యాన్ని జి.కొత్తపల్లిలోని ఉపాధిహామీ కూలి దాసరి రాజు ఇంట్లో నిల్వ చేస్తున్నాడు. రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఆ బియ్యాన్ని బయటకు తరలిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం సివిల్ సప్‌లై డిప్యుటీ తహసీల్దార్‌లు నాగరాజు, వెంకటేశ్వరరావు, వీఆర్‌ఏ బ్రహ్మయ్యలు ఆ ఇంటిపై దాడి చేశారు. అనంతరం పోలీసుల సమక్షంలో గది తలుపులు తెరచి 75 రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.

12న వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ సమావేశం