
వేదంతో పులకించిన సరిపల్లె
గణపవరం: గణపవరం మండలం సరిపల్లె గ్రామం వేదపండితులు, ఘనాపాఠీలు, వేద విద్యార్థుల పాదస్పర్శతో పులకరించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన వేదవిద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇక్కడ నిర్వహించే వేద పరీక్షలకు హాజరయ్యారు. వీరిని పరీక్షించడానికి వేదపారాయణం, పాండిత్యంలో ఆరితేరిన వేదపండితులు, ఘనపాఠీలు పరీక్షాధికారులుగా విచ్చేశారు. సరిపల్లెలోని సఖ్యాభివర్ధక నిలయంలో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో 105వ వేదశాస్త్ర పరిషత్ మహా సభలు మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. గణపవరానికి చెందిన సాగిరాజు సుబ్బరాజు ఆర్థిక సహకారంతో గత మూడు దశాబ్దాలుగా సరిపల్లె టీటీడీ కల్యాణమండపంలోని ఈ వేదశాస్త్ర పరిషత్ మహాసభలు నిర్వహిస్తున్నారు. వేదవిద్యార్ధులకు ఇక్కడ రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలలో పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు అందచేస్తారు. ఏటా శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజును నిర్వహించే వేదపరిషత్ సభలో ఉత్తీర్ణులైన వేద విద్యార్థులకు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. గురు, శుక్రవారాలలో నాలుగు వేదాలలో నిర్వహించిన పరీక్షలకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతోపాటు, బిహార్, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర తదితర 10 రాష్ట్రాల నుంచి 130 మంది వేద విద్యార్థులు హాజరయ్యారు.