
స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలి
భీమవరం: విద్యుత్ స్మార్ట్ మీటర్లు తక్షణం రద్దు చేసి ట్రూఅప్ చార్జీలు ఉపసంహరించాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు జేఎన్‌వీ గోపాలన్, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు చెల్లబోయిన రంగారావు డిమాండ్ చేశారు. ప్రజా వేదిక పిలుపులో భాగంగా మంగళవారం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి దగ్గరలో విద్యుత్ సబ్‌స్ట్షేన్ వద్ద ప్రజావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో మాట్లాడారు, అదానీతో విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వాడుకున్న విద్యుత్‌కు అదనపు రుసుం ఇప్పుడు వసూలు చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలను రాష్ట్రం అమలు చేయడం దారుణమని పెంచిన విద్యుత్ భారాలు ఉపసంహరించకపోతే మరో పోరాటానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఏఐసీటియు, టీయుసీసీ నాయకులు లంక కృష్ణమూర్తి, కొల్లాబత్తుల మహంకాళి మాట్లాడుతూ.. విద్యుత్ ఒప్పందాలు రద్దుచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎలక్ట్రికల్ జేఈకి వినతి పత్రం అందచేశారు. కార్యక్రమంలో ప్రజా వేదిక నాయకులు బి.వాసుదేవరావు, జక్కంశెట్టి సత్యనారాయణ, కె.క్రాంతిబాబు, ఇంజేటి శ్రీను, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లోనూ ప్రజా వేదిక ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు.