
ఉద్యోగుల సమస్యలపై చర్చకు ప్రత్యేక కార్యక్రమం
భీమవరం: రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో టీ తాగుతూ మాట్లాడుకుందాం రండి అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సంఘం రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు రవీంద్రరాజు చెప్పారు. మంగళవారం భీమవరం పట్టణంలోని జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో జిల్లా అధ్యక్షుడు యాళ్ళ మెహన రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగులంతా సమస్యలపై చర్చించి ప్రభుత్వం వద్ద పేరుకుపోయిన రూ.30 వేల కోట్ల బకాయిలు, పెండింగ్ డీఏలు, ఐఆర్, పీఆర్సీ కమిషన్ వంటిపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఉద్యోగులను చైతన్య పర్చడానికి టీ తాగుతూ మాట్లాడుకుందాం రండి కార్యక్రమం శ్రీకారం చుట్టామన్నారు. వారానికో సమస్యపై ఉద్యోగులంతా టీ తాగుతూ చర్చిస్తామని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వైఖరిని తెలియచేస్తామని రవీంద్రరాజు చెప్పారు. సంఘం జిల్లా కార్యదర్శి జక్రయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు షేక్ ఉమర్ అలీషా, ఉపాధ్యక్షులు రాజేష్ కుమార్, మానస తదితరులు పాల్గొన్నారు.