
ప్రభుత్వ భవనాలకే రక్షణ లేదు..!
కాళ్ల: లక్షలాది రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ భవనాలు సైతం ప్రైవేటు వ్యక్తులు కూల్చివేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పట్టపగలు అందరూ చూస్తుండగా ఇలాంటి దౌర్జన్యంకు పాల్పడుతున్నా అధికారులు సైతం మిన్నకుండిపోవడం గమనార్హం. కాళ్ల మండలం బొండాడ గ్రామంలో సామూహిక మరుగుదొడ్ల భవనం (కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్) కూల్చివేత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... గత ప్రభుత్వ హయాంలో బొండాడ గ్రామంలో నూతన సచివాలయ భవనం నిర్మించారు. దానిని ఆనుకుని సుమారు రూ.3 లక్షలతో ఇ ఇ బిల్డింగ్ (కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్) పురుషులు, స్ట్రీలకు విడివిడిగా రెండు బాత్‌రూమ్‌లు నిర్మించి పంచాయతీకి అప్పగించారు. అయితే సమీపంలోని ప్రైవేటు వ్యక్తి అవి మా స్థలంలో ఉన్నాయంటూ ఇటీవల వాటిని నిర్లక్ష్యంగా కూల్చివేసి అసలు అక్కడ వాటి ఆనవాళ్లు లేకుండా చేశాడు. సదరు వ్యక్తి ఇంత దారుణానికి ఒడిగట్టిన విషయం అందరికీ తెలిసినా అధికారులు మాత్రం తమకేమీ సంబంధం లేదన్నట్లు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ఒక ప్రభుత్వ భవనాన్ని కూల్చాలంటే స్పష్టమైన అనుమతులతో అధికారుల సమక్షంలో పనులు చేపట్టాలి. కనీసం సచివాలయ భవనం ప్రారంభం కాకుండానే ఇలా లక్షలాది రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన కట్టడం కూల్చివేయడం వెనుక అంతర్యం ఏంటో అర్థం కావడం లేదని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇటీవల దీనిపై గ్రామ ఉపసర్పంచ్ పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. లోపాయికారి ఒప్పందాలే ఇందుకు కారణమని, అందుకే ఎవరూ పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై కాళ్ల డిప్యూటీ ఎంపీడీవో భాస్కరరావును వివరణ కోరగా సదరు భవనం విషయం తన దృష్టికి వచ్చిందని, క్షేత్రస్థాయిలో పరిశీలించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
బొండాడలో సామూహిక మరుగుదొడ్ల భవనం కూల్చివేత
పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కి ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
ప్రభుత్వ భవనాన్ని కూల్చివేస్తున్నారని నేనే స్వయంగా వెళ్లి పంచాయతీలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో గత నెల 23వ తేదీన కలెక్టర్ దగ్గరికి వెళ్లి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశా. దానిపై ఇటీవల డిప్యూటీ ఎంపీడీవో భాస్కరరావు వచ్చి ఎండార్స్‌మెంట్ ఇవ్వాలి అని సంతకం తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయం సమస్య పరిష్కారమైందంటూ నా మొబైల్‌కి మెసేజ్ వచ్చింది. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సబబు. ఈ విషయంపై మరలా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి న్యాయపోరాటం చేస్తా.
– గునుపూడి ప్రసన్నకుమార్, ఉప సర్పంచ్, బొండాడ

ప్రభుత్వ భవనాలకే రక్షణ లేదు..!

ప్రభుత్వ భవనాలకే రక్షణ లేదు..!