
వర్జీనియా ధర పతనం
రూ.390 నుంచి రూ.370కి పడిపోయిన ధర
కొయ్యలగూడెం: వర్జీనియా పొగాకు వేలం ధరలు అమాంతంగా పడిపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. శనివారం కొయ్యలగూడెం పొగాకు వేలం కేంద్రంలో నిర్వహించిన కొనుగోళ్లలో నాణ్యమైన పొగాకు ధర కేజీకి రూ. 390 నుంచి ఒక్కసారిగా రూ.370కు పడిపోవడంతో రైతులు నిరుత్సాహానికి గురయ్యారు. పొగాకును కొనుగోలు చేసే ప్రధాన కంపెనీకి చెందిన అలయన్ కంపెనీ కొనుగోళ్ల నుంచి తప్పుకోవడం ధరల పతనానికి కారణంగా తెలిసింది. దీంతో మిగిలిన కొనుగోలుదారులు ఇదే అదునుగా భావించి పొగాకు ధరను తగ్గించి కొనుగోలు చేయడానికి సిండికేట్‌గా మారారని రైతులు ఆరోపించారు. మార్చి నెలలో రూ. 290తో ప్రారంభమైన వర్జీనియా పొగాకు కొనుగోలు సుమారు 4 నెలలకు గాని రూ.390కు చేరుకోలేకపోయిందన్నారు. కాగా ధర మరింత పతనం అయ్యే అవకాశం ఉందని, ఇందుకు కంపెనీలు సిద్ధం అవుతున్నాయని ప్రధాన కంపెనీలోని ప్రైవేటు ఉద్యోగి ఒకరు పేర్కొన్నారు. విదేశీ ఆర్డర్లు లేవంటూ సాకు చూపిస్తున్నారని క్లూ ఇచ్చారు. ఇచ్చిన అనుమతుల కంటే పరిమితికి మించి పంటను ఉత్పత్తి చేయడం వలన ఏర్పడిన సంక్షోభం ఇది అని బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.