
ఉలిక్కిపడిన వరహాపట్నం
కై కలూరు: భూమి నుంచి వచ్చిన భారీ శబ్ధం.. మందుపాతర మాదిరిగా పేలడంతో శనివారం వరహాపట్నం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాంబులంటూ ప్రజలు భయాందోళన చెందారు. వివరాల ప్రకారం వరహాపట్నం నుంచి కలిదిండి వెళ్లే రహదారిలో కూడలి వద్ద సేద తీరే సిమెంటు బెంచీపై ఉదయం ముగ్గురు యువకులు కూర్చుని కబుర్లాడుకుంటున్నారు. ఇంతలో సమీప భూమి నుంచి రెండు లారీ టైర్లు ఒక్కసారిగా పేలిన శద్ధం వచ్చింది. ఆ ప్రాంతమంతా దుమ్ముతో నిండిపోయింది. బెంచీపై కూర్చున్నా కోనాల నానీ, పడమటి శివగణేష్, సోమగాని కార్తీక్‌లకు స్వల్పంగా రాళ్ల గాయాలయ్యాయి. గ్రామస్తులు రూరల్ ఏఎస్సై వెంకటేశ్వరరావుకు సమాచారం అందించారు. ఆయన సిబ్బందితో వచ్చి గాయపడిన యువకుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఏలూరు నుంచి బాంబు, డాగ్ స్క్వాడ్‌లు వచ్చాయి. పొక్లెయిన్‌తో పేలుడు సంభవించిన ప్రాంతాన్ని తవ్వి బాంబుకు సంబంధించి ఎటువంటి అనవాళ్లు లేవని నిర్థారించారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం వర్షపు నీరు వెళ్లడానికి పేలుడు సంభవించిన కొంత దూరంలో డ్రెయిన్‌ను తవ్వారు. పేలుడు జరిగిన చోట గతంలో మెకానిక్ షెడ్, ఎలక్రిక్టల్ రిపేరు షాపు ఉండేదని గ్రామస్తులు చెప్పారు. భూమిలో బ్యాటరీ కాని, భూమి అడుగున కూల్ డ్రింక్ సీసాలలో గ్యాస్ వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. హఠాత్తుగా జరిగిన పరిణామంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ప్రజలు భయపడవద్దని పోలీసులు చెప్పారు.
భూమి నుంచి భారీ పేలుడు
బాంబులంటూ భయపడిన ప్రజలు
ముగ్గురికి స్వల్ప రాళ్ల గాయాలు
బాంబ్, డాగ్ స్క్వాడ్‌ల పరిశీలన

ఉలిక్కిపడిన వరహాపట్నం