
తీరంలో యథేచ్ఛగా తవ్వకాలు
నరసాపురం రూరల్: నరసాపురం తీర ప్రాంత గ్రామాల్లోని మట్టి, బొండు ఇసుకతో పాటు సముద్ర పరీవాహక ప్రాంతంలోని ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు. ఈ మట్టి దందాకు అధికారుల అండదండలు ఉండటంతో కూటమి నేతలకు కాసుల వర్షం కురుస్తోంది. యథేచ్ఛగా మట్టి, ఇసుక తవ్వకాలు సాగిస్తున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లినవారిపై కేసులు నమోదు చేస్తామంటూ ఓ అధికారి బెదిరింపులకు దిగడం గమనార్హం.
నరసాపురం మండలం వేములదీవి, చినమైనవానిలంక, బియ్యపుతిప్ప ప్రాంతాల్లోని సీఆర్‌జడ్, జిరాయితీ భూముల్లోని ఇసుకను కూటమి పార్టీల నాయకులు యథేచ్ఛగా భారీ యంత్రాలతో తవ్వి, లారీలు, ట్రాక్టర్లలో ఎగుమతి చేసి సొమ్ము చేసుకుంటున్నప్పటికీ అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. నిబంధనల మేరకు సీఆర్‌జెడ్ భూముల్లో ఎలాంటి తవ్వకాలు చేపట్టకూడదని అధికార పార్టీ నేతలు, మట్టి అమ్మకందారులు కుమ్మకై ్క యథేచ్ఛగా ఇసుకను విక్రయిస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఒకరు తన పంచాయతీ పరిధిని దాటి వేరొక పంచాయితీలో ఇసుక తవ్వకానికి పూనుకోవడంతో అక్కడివారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధికార పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధినని తననే అడ్డుకుంటారా అంటూ దూషించినట్లు తెలిసింది. తప్పుడు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నట్లు సమాచారం. నరసాపురం నియోజకవర్గంలో ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదని అధికారులందరూ కూటమి నేతలకు తొత్తులుగా మారి వారికి అనుకూలంగా పనిచేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
కూటమి నేతలకు కాసుల వర్షం
నిబంధనలకు పాతర
పట్టించుకోని అధికారులు

తీరంలో యథేచ్ఛగా తవ్వకాలు