
వార్డు సచివాలయ కార్యాలయం మార్పు
ఆకివీడు: స్థానిక నగర పంచాయతీలోని సచివాలయం–5 కార్యాలయ భవనం శిథిలావస్థలో ఉండటంతో కార్యాలయాన్ని స్థానిక వెలంపేట రామాలయం వద్దకు మార్పు చేసేందుకు చర్యలు చేపట్టామని నగర పంచాయతీ చైర్‌పర్సన్ జామి హైమావతి సోమవారం చెప్పారు. జాతీయరహదారికి చేర్చి పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల భవనం కూలడానికి సిద్ధంగా ఉందని, దానిలో సచివాలయం, ప్రైవేటు విద్యా సంస్థను నడుపుతున్నారని సాక్షిలో వచ్చిన కథనానికి ఆమె స్పందించారు. భవన యజమానికి, విద్యా సంస్థ యజమాన్యానికి నోటీసులు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. సచివాలయ కార్యాలయం మార్చి, మంగళవారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
భీమవరం అర్బన్: భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యనమదుర్రు గ్రామానికి చెందిన తోలేరు సత్యనారాయణ (60) అనారోగ్యంతో ఇంటివద్దే ఉంటున్నాడు. ఆస్పత్రులు చుట్టూ తిరిగి ఎన్ని చికిత్సలు చేయించుకున్నా ఆరోగ్యం కుదుట పడటం లేదు. దీంతో ఆ బాధ తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సత్యనారాయణ కుమారుడి ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ పి.మహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బంగారం, వెండి చోరీ
నరసాపురం రూరల్: మండలంలోని గొందిలోలో తాళం వేసిన ఇంట్లో చోరీ చేసిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఈ ఘటనకు సంబందించి ఎస్సై టి.వెంకట సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శీలబోయిన దేశింగరావు ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ నెల 12 ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లారు. తిరిగి 13న ఇంటికి వచ్చేసరికి తాళం పగులగొట్టి బీరువాలోని సుమారు రెండున్నర కాసులు బంగారం, 30 గ్రాముల వెండి, సుమారు రూ.5 వేల నగదు పట్టుకుపోయారు. చోరీ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎసై టీవీ సురేశ్ గ్రామానికి వెళ్లి చోరీ జరిగిన తీరును పరిశీలించారు. భీమవరం నుంచి క్లూస్ టీంను రప్పించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.