
ఎండుతున్న నారుమళ్లు
భీమవరం: నీటిపారుదల శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో సాగు నీరందక సార్వా నారుమళ్లు ఎండిపోతున్నాయని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లాలోని వివిధ గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకున్న అనంతరం భీమవరంలో విలేకర్లతో మాట్లాడారు. సాగునీటి సమస్యపై పోడూరు, ఆచంట, యలమంచిలి, పాలకోడేరు, అత్తిలి, వీరవాసరం మండలాల్లోని రైతులతో మాట్లాడినట్లు రామాంజనేయులు తెలిపారు. చెంతనే గోదావరి ఉన్నా సార్వా నారుమళ్లకు నీరందకపోవడంతో ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితి అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని సామెత చందాన గోదావరిలోని నీరు సముద్రంలోకి వెళ్తుంటే అనేక మండలాల్లో వేలాది ఎకరాలకు సాగునీరందక నారుమళ్లు ఎండిపోయాయన్నారు. కొన్నిచోట్ల కనీసం దమ్ము చేసే అవకాశం లేదని కౌలురైతులు వాపోతున్నారన్నారు. ఇరిగేషన్ శాఖమంత్రి జిల్లాలోనే ఉన్నా ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో వేలాది రూపాయలు ఖర్చుచేసి వేసిన నారుమళ్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కాలువలు వదిలి రెండు నెలలైందని మరోపక్క గోదావరి ఉధృతంగా సముద్రంలోకి వెళ్తున్నా రైతులకు సాగునీటి కష్టాలేంటని ప్రశ్నించారు. కాలువలకు లెవల్ పెంచి పూర్తి స్థాయిలో సాగునీరు ఇవ్వాలని, తక్షణం చించినాడ, కవిటం, దేవ, చినమల్లం బ్యాంక్ కెనాల్, మోగల్లు పంట కాలువలకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.