
అక్రమ చేపల చెరువుల జాతర
సాక్షి, టాస్క్‌ఫోర్స్: పచ్చని పైర్లతో ధాన్యగారంగా పేరుపొందిన ముదినేపల్లి మండలాన్ని ఆక్వా చెరువులు ఆక్రమిస్తున్నాయి. వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్చాలంటే కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ కూటమి నేతల ముందు అవి పనిచేయడం లేదు. కై కలూరు నియోజకవర్గంలో ప్రభుత్వానికి సమాంతర పాలన సాగుతోంది. ఆక్వా చెరువుల వల్ల తమకు నష్టం జరుగుతోందని గ్రామస్తులు రొడ్కెక్కుతున్నా అక్రమార్కుల కుట్రల ముందు ప్రజల వేదన అరణ్యరోదనగా మారుతోంది.
ఏడాదిలో 400 ఎకరాల్లో చెరువులు
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఒక్క ముదినేపల్లి మండలంలో దాదాపు 400 ఎకరాల్లో చేపల, రొయ్యల చెరువులను తవ్వేశారు. దేవరం గ్రామంలో ప్రస్తుతం 27 ఎకరాల విస్తీర్ణంలో ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులు తవ్వుతున్నారు. ఇదే మండలంలో పెదగొన్నూరులో 100, ఊటుకూరులో 100, వాడవల్లిలో 80, వణుదుర్రులో 70, దేవపూడిలో 40, పేరూరులో 10, గురజలో 10, వైవాకలో 6 ఎకరాల్లో చెరువులు తవ్వారు. కూటమిలో టీడీపీ, జనసేన నేతలు పోటాపోటీగా చెరువులు తవ్వేస్తున్నారు. ఓ సినీ నిర్మాతకు చెందిన చెరువు తవ్వకం ఇటీవల వివాదంగా మారింది. వణుదుర్రు గ్రామంలో ఆక్వా చెరువుల వల్ల తాగునీటి చెరువు కులుషితమవుతోందని గ్రామస్తులు ఆందోళన చేసినా ఫలితం కనిపించలేదు.
చట్టాలంటే లెక్కే లేదు
కూటమి నేతలు చట్టాలను లెక్క చేయడం లేదు. వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్పు చేయాలంటే మండల స్థాయి కమిటీ నుంచి జిల్లా స్థాయి కమిటీ సిఫార్సుల మేరకు డీఎల్‌సీలో ఆమోదం తెలపాలి. ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ(అప్సడా) నిబంధనలు పాటించాలి. మత్స్య శాఖ, రెవెన్యూ, ఇరిగేషన్, డ్రెయినేజీ, అగ్రికల్చర్, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పరిశీలన చేసి జిల్లా అధికారులకు నివేదిక ఇవ్వాలి. వరి పొలాలకు 3 మీటర్లు, తాగునీటి చెరువు, శ్మశానాలకు 10 మీటర్ల దూరంలో మాత్రమే చెరువు తవ్వాలి. ఇవేమి పాటించడం లేదు. దేవరంలో చేపల చెరువు తవ్వకాలపై గ్రామ వీఆర్వో ఏడుకొండలను వివరణ కోరగా మీరు ముదినేపల్లిలో బుజ్జిని కలవండని చెప్పడం విస్తుగొలిపింది. మత్స్యశాఖ అధికారి సతీష్‌కుమార్‌ను అడిగితే రెండేళ్ళ క్రితం చెరువు తవ్వకాలకు ధరఖాస్తు చేశారని, ఇప్పుడు అనుమతులు గురించి తెలీదని తప్పించుకున్నారు. ఈ విధంగా పలు శాఖల అధికారులు కూటమి నేతలకు భయపడి దాటవేత ధోరణి అనుసరిస్తున్నారు.
ఇది మా అడ్డా
కూటమి విజయంలో మా మండలం కీలకపాత్ర పోషించింది. ఇది మా అడ్డా అనే ధోరణి మండలంలో కనిపిస్తోంది. అక్రమ చెరువుల తవ్వకం, అక్రమ మైనింగ్ యథేచ్చగా సాగుతున్నా రెవెన్యూ, పోలీసు శాఖలు అటుగా చూడడానికి జంకుతున్నారు. ఇక పేకాట సంగతి సరే సరి. చెరువు గట్లు పేకాట క్లబ్‌లుగా మారుతున్నాయి. సమీప గుడివాడ నుంచి పేకాటరాయుళ్లు ఈ మండలానికి వస్తున్నారు. ఈ మండలంలో పేరు మోసిన పేకాట నిర్వాహకుడు పలుమార్లు పోలీసుల చేతికి చిక్కినా.. రాజకీయ నాయకుల అండతో బయటపడుతున్నాడు. రాష్ట్ర స్థాయిలో టీడీపీ నాయకుల పరిచయాలతో ఏదైనా చేయవచ్చనే ధోరణి ఈ మండలంలో స్పష్టంగా కనిపిస్తోంది.
వరిని మింగుతున్న చెరువులు
వరిని ఆక్వా చెరువులు మింగేస్తున్నాయి. పచ్చని పొలాలు చేపల, రొయ్యల చెరువుగా మారుతున్నాయి. నియోజకవర్గంలో కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో వ్యవసాయ సాగు విస్తీర్ణం 22,493 ఎకరాల్లో ఉంది. మొత్తం 10,766 రైతులు జీవనం సాగిస్తున్నారు. ఇక ఆక్వా చేపల, రొయ్యల విషయానికి వస్తే నాలుగు మండలాల్లో 84,755 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ముదినేపల్లి మండలంలో పూర్వం 25 వేల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ సాగు ఉండేది. ఇప్పుడు 14,000 ఎకరాలకు పడిపోయింది. ముదినేపల్లి మండంలో విచ్చలవిడి చెరువుల తవ్వకాల వల్ల రానున్న రోజుల్లో వ్యవసాయం కనుమరగయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ముదినేపల్లి మండలంలో ఏడాదిలో 400 ఎకరాల్లో చెరువులు
అమలుకాని అప్సడా నిబంధనలు
చోద్యం చూస్తున్న రెవెన్యూ, మత్స్య శాఖ అధికారులు

అక్రమ చేపల చెరువుల జాతర