
ప్లీజ్.. వెళ్లొద్దు టీచర్
ఆకివీడు: కొన్నేళ్లుగా తమ పాఠాలు చెప్పిన టీచరు వెళ్లిపోతుంటే ఆ విద్యార్థులంతా కన్నీరు పెట్టుకున్నారు. ఈ సంఘటన ఆకివీడు మండలం సిద్ధాపురంలో జరిగింది. సిద్ధాపురం ఎంపీపీ పాఠశాలలో 8 ఏళ్లు పనిచేసిన ఉపాధ్యాయురాలు బెజవాడ ప్రసన్న దుర్గ ఇటీవల దుంపగడప ఎంపీపీ పాఠశాలకు బదిలీ అయ్యారు. సిద్ధాపురం పాఠశాలలో శనివారం ఆమెకు వీడ్కోలు సభ నిర్వహించారు. అదే సమయంలో విద్యార్థులు శ్రీఅమ్మా నువ్వు వెళ్లవద్దు, మా స్కూల్లోనే ఉండు, మాతోనే ఉండుశ్రీ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. విద్యార్థులతో పాటు అక్కడున్న తల్లిదండ్రులు, స్థానికులు కంట తడిపెట్టారు. పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలను నాడు–నేడులో ఎంతో సుందరంగా తీర్చిదిద్దారన్నారు. తమ పిల్లలకు కావాల్సిన వసతులు కల్పించారన్నారు. ఇలాంటి ఉపాధ్యాయురాలు బదిలీ అయితే తమకు, తమ గ్రామానికి కూడా నష్టమేనన్నారు.