
జల్లేరు ఆధునికీకరణ పనులు ప్రారంభం
బుట్టాయగూడెం: మండలంలోని దొరమామిడి సమీపంలో ఉన్న గుబ్బల మంగమ్మతల్లి జల్లేరు జలాశయం నిర్వహణ పనుల నిమిత్తం రూ. 20 లక్షల నిధులు మంజూరు చేసినట్లు మైనర్ ఇరిగేషన్ ఏఈ టి.సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ నిధులతో గేట్లు, రంగులు వేయడం, ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్, ఆయిల్, గ్రీజు పనులు ఏడాది పాటు నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నట్లు, గతంలో రూ. 8 లక్షల వ్యయంతో స్పిల్‌వే గేట్లు మరమ్మతులు కూడా పూర్తి చేశామని తెలిపారు.
మావుళ్లమ్మ సన్నిధిలో మహా సుదర్శన హోమం
భీమవరం(ప్రకాశం చౌక్): పట్టణంలోని మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద శుక్రవారం ఉదయం 7.30 గంటలకు మహా సుదర్శన హోమం నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, వేదపండితులతో అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించామని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మీ నగేష్ తెలియజేశారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు యాగాన్ని ప్రారంభించి, అమ్మవారిని దర్శించుకునారు. సుమారు 1500 మంది భక్తులకు అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని, భోజన సదుపాయాన్ని కల్పించారు.
ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి
భీమవరం(ప్రకాశం చౌక్): భవ్య భీమవరం పేరిట చేపట్టిన వివిధ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సీహెచ్ నాగరాణి భవ్య భీమవరం ప్రాజెక్టుల పురోగతిపై భీమవరం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, ఆర్డీవో, మున్సిపల్ అధికారులతో సమావేశమై సమీక్షించారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం చుట్టుపక్కల ఆధ్యాత్మికతతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుకు మున్సిపల్ అధికారులు కృషి చేయాలన్నారు. నిబంధనలను అతిక్రమించి ఉన్న ఆక్రమణదారులకు వెంటనే నోటీసులు జారీ చేసి, తొలగింపుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భీమవరంలో స్విమ్మింగ్ ఫూల్ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే చేపట్టిన పాత బస్టాండ్ మోడ్రన్ బస్ స్టాప్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ, భీమవరం మున్సిపాలిటీ స్పెషలిటీ ఆఫీసర్ కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్ర రెడ్డి, సహాయ కమిషనర్ ఎ.రాంబాబు, జిల్లా టూరిజం అధికారి ఏవీ అప్పారావు, మున్సిపల్ ఇంజనీర్ పి.త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.