
ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత
కామవరపుకోట : స్థానిక గుర్రాల చెరువు గట్టు వినాయక గుడి వెనుక శుక్రవారం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు చినికి చినికి తీవ్రంగా మారాయి. గురువారం రెండు వర్గాల మధ్య చిన్నపాటి వివాదం జరగ్గా శుక్రవారం మధ్యాహ్నం దానికి కొనసాగింపుగా ఓ వర్గం వారు చేసిన దాడుల్లో ఓ కుటుంబానికి చెందిన టిప్‌టాప్ సామగ్రి ధ్వంసమై భారీ నష్టం జరిగిందని బాధితులు చెబుతున్నారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్రతో ఆధ్వర్యంలో నలుగురు ఎస్సైలు, పలువురు పోలీసు సిబ్బంది పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు. డీఎస్పీ రవిచంద్ర రాత్రి 8 గంటలు అయినా కూడా అక్కడే ఉండి పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. ఈ సంఘటనపై డీఎస్పీని వివరణ కోరగా వివాదం పూర్తి వివరాలను పరిశీలించి చెబుతానని తెలిపారు. అయితే ఈ వివాదం జరిగిన ప్రాంతంలో ఉన్న భూమిని దేవదాయ శాఖ అధికారులు శుక్రవారం రాత్రి రంగంలోకి దిగి స్వాధీనం చేసుకునే పనులు మొదలు పెట్టారు. ఆ స్థలంలో ఉన్న తూములను కూలీలతో పక్కకు తొలగిస్తున్నారు.