
శాశ్వత పనులకు నోచుకోని తమ్మిలేరు కాజ్‌వే
చాట్రాయి: వరద వచ్చినపుడల్లా తరుచూ కొట్టుకుపోతున్న చిన్నంపేట తమ్మిలేరు కాజ్‌వేతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు ద్వారా మండలంలోని తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టుకు వరద వచ్చినపుడల్లా చిన్నంపేట కాజ్‌వే కొట్టుకుపోతుంది. దీంతో రెండు వారాల పాటు మండలంలోని చిన్నంపేట, చింతలపూడి మండలం శివాపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయి ఆయా గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ రెండు గ్రామాల వారికి ఇరువైపులా వ్యవసాయ భూములు ఉండడం, నిత్యావసర వస్తువులు కొనుగోలుకు శివాపురం గ్రామస్తులు చిన్నంపేట రావాల్సి ఉంది. అంతేగాక శివాపురం నుంచి చిన్నంపేటకు పాఠశాలలకు విద్యార్థులు వస్తుంటారు. కాజ్‌వే కొట్టుకుపోయినపుడల్లా మరమ్మతుల కోసం లక్షల్లో నిధులు వెచ్చిస్తున్నారు. తరుచూ ఈ విధమైన మరమ్మతులు చేపట్టి నిధులు ఖర్చు పెట్టడం కన్నా వాగుకు శాశ్వతమైన కాంక్రీట్‌తో కూడిన కాజ్‌వే నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.