
పొట్టకూటి కోసం వెళ్లి.. ప్రాణాలు వదిలి
ఉండి : పొట్టకూటి కోసం వెళ్లిన వ్యక్తికి విద్యుత్ షాక్ తగలడంతో మృతి చెందాడు. ఈ ఘటన ఉండి మండలం వెలిపర్రులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం బొజ్జా రవి(23), నాగరాజు అనే ఇద్దరు బోదెల్లో, కాలువల్లో చేపలు పట్టి కుటుంబాలను పోషించుకుంటున్నారు. బుధవారం వెలివర్రులోని ఆక్వా చెరువుల వద్ద ఉన్న బోదెలో చేపలు పట్టేందుకు వెళ్లారు. రవి తన వద్ద ఉన్న వలతో చేపలను పట్టేందుకు బోదెలోకి దిగగా విద్యుత్ పోల్ నుంచి కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగ కాలికి చుట్టుకుని విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించడంతో వారు విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు. అయితే అప్పటికే రవి మృతి చెందాడు. ఎస్సై ఎండీ నసీరుల్లా ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుడు రవికి ఏడాది క్రితం భీమవరం లంకపేటకు చెందిన మావుళ్ళుతో వివాహమైంది. వారికి నెల రోజుల క్రితం మగబిడ్డ పుట్టాడు. తమకు దిక్కెవ్వరూ రవి భార్య, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి