
వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వినియోగదారులు తమ హక్కులపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, తూనికలు, కొలతలకు సంబంధించిన చట్టాలను తెలుసుకోవాలని తూనికలు, కొలతల శాఖ ఏలూరు జిల్లా ఉప నియంత్రకులు బి.వెంకట హరిప్రసాద్ అన్నారు. ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవం సందర్భంగా నగరంలోని ఆ శాఖ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వినియోగదారులకు తాము మోసపోతున్నామని గ్రహిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. పెట్రోల్ బంకుల్లో కొలతల్లో మోసం జరుగుతున్నా, వస్తువుల తూకాల్లో తేడా ఉన్నట్లు గ్రహించినా వెంటనే అప్రమత్తం కావాలని సూచించారు. వ్యాపారస్తులు వినియోగదారులకు అందించాల్సిన సేవలు, వ్యాపారస్తులు పాటించాల్సిన నియమ నిబంధనలపై వివరించారు. అలాగే వ్యాపారస్తులు ఉత్పత్తి చేసి, విక్రయించే ప్రతి ప్యాకేజీపై తయారీదారుని పేరు, ప్యాకేజీ చేయబడిన వస్తువు పేరు, దాని నికర బరువు ముద్రించాలన్నారు. కార్యక్రమంలో సహాయ నియంత్రకులు బీఎన్‌వీఎస్ ఈశ్వర రామ్, పరిశీలకులు వి. ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల ధర్నా
కామవరపుకోట: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం స్థానిక శ్రీవేంకటేశ్వర జూనియర్ కళాశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం ధర్నా నిర్వహించారు. అడ్మిషన్లు తీసుకోకుండా కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తూ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. 42 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కాలేజిని మూసివేసే ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు కాగా దీనిపై కళాశాలకు వచ్చిన ఆర్‌ఐఓ యోహాన్‌ను వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాశాలకు వచ్చానని కానీ ఇక్కడ తిరుపతి దేవస్థానం ఈవో చెబితేనే గాని అడ్మిషన్లు ఇవ్వమని యాజమాన్యం చెప్పారని త్వరలో అడ్మిషన్ తీసుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరం