
తల్లీబిడ్డ సేవలకు సుస్తీ
వేధిస్తున్న సమస్యలు
మార్చి 30తో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను నడుపుతున్న ప్రైవేట్ సంస్థతో టెండరు గడువు ముగియగా ప్రభుత్వం మరో రెండు నెలలు పాటు పొడిగించినట్టు యూనియన్ నాయకులు చెబుతున్నారు. గతంలో అవసరమైన మేర వాహనాల్లో డీజిల్ పోయించుకునే వెసులుబాటు ఉండగా కొద్దినెలలుగా పరిమితం చేసినట్టు చెబుతున్నారు. దీంతో నెలలో డీజిల్ ఉన్న మేర వాహనాలను నడిపి అయిపోయినప్పుడు మూలకు చేరుస్తున్నారు. మరోపక్క సకాలంలో ఆయిల్ ఛేంజింగ్, మరమత్ముల చేయకపోవడంతో ఇబ్బంది పడాల్సి వస్తోందంటున్నారు. సేవలు సరిగా అందక తల్లీబిడ్డలను ఇళ్లకు తీసుకువెళ్లేందుకు వారు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి వారు అడిగిన మొత్తం చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు.
సాక్షి, భీమవరం: తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలకు సమస్యల సుస్తీ చేసింది. డీజిల్ కొరత, మరమ్మతులతో సేవ లందించేందుకు ఆపసోపాలు పడుతోంది. అరకొర సేవలతో బాలింతలు, వారి కుటుంబ సభ్యులు అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఒక్క రోజు సమ్మె నిర్వహణకు యూనియన్ సిద్ధమైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు ప్రసవానంతరం ప్రభుత్వం 102 పేరిట తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనంలో తల్లీబిడ్డలను సురక్షితంగా వారి ఇంటికి చేరవేస్తుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా 32 వాహనాలు ఉండగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ వాహనాలు సేవలందిస్తున్నాయి. రోజుకు 200 మంది వరకు తల్లీబిడ్డలను వారి ఇళ్లకు చేరుస్తున్నాయి. గతంలో సాఫీగా సాగిన సేవలు కొంత కాలంగా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలో 14 వాహనాలు ఉండగా వాటిలో తొమ్మిది మాత్రమే సేవలు అందిస్తున్నాయి. ఆచంట, తాడేపల్లిగూడెం, తణుకు తదితర చోట్ల ఐదు వాహనాల కెప్టెన్లు (డ్రైవర్లు) కొరత, మరమ్మతులతో మూలకు చేరాయి.
డిమాండ్ల సాధన కోసం పోరుబాట
ప్రస్తుతం ఇస్తున్న రూ.8,850 జీతం సకాలంలో ఇవ్వకపోగా నెలల తరబడి బకాయిలు పేరుకుపోతున్నాయి. ఏపీ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ పలుమార్లు ప్రభుత్వానికి వినతులు అందజేయడంతో ఇటీవల ఫిబ్రవరి వరకు బకాయిలు విడుదల చేసింది. మరో రెండు నెలలు జీతాలు రావాల్సి ఉన్నట్టు నాయకులు చెబుతున్నారు. కనీస వేతనం రూ.18,500 ఇవ్వాలని, వాహనాలకు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని, ఆదివారం, వీక్లీ ఆఫ్‌లు, పండుగ సెలవులు అమలుచేయాలని, యజమాని వాటా పీఎఫ్‌ను యాజమాన్యమే చెల్లించాలని, ఈఎస్‌ఐ అమలుచేయాలని, 8 గంటలు పని విధానం, బఫర్ సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు. డిమాండ్ల సాధన కోసం యూనియన్ పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో మంగళవారం ఒక్క రోజు సమ్మెలో భాగంగా కలెక్టరేట్ల వద్ద నిరసన వ్యక్తం చేయనున్నట్టు యూనియన్ నాయకులు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మెరుగైన సేవలు
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను పేదలకు ఎంతో మెరుగ్గా అందించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృషి చేసింది. ఎయిర్ కండిషన్డ్ సౌకర్యాలతో కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి దూరప్రాంతాలకు సైతం ఈ వాహనాల్లో తల్లీబిడ్డలను వారి గమ్యస్థానాలకు చేరవేసేలా కార్యాచరణ చేసి అమలుచేశారు. ప్రసవానంతరం తల్లీబిడ్డలతో ఇళ్లకు చేరుకునేందుకు పేదవర్గాల వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉండేది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పుడు సేవలందించేందుకు వాహనాలు మొరాయిస్తుండటంతో వారు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తల్లీబిడ్డ సేవలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని పేదలు కోరుతున్నారు.
ప్రజారోగ్యానికి ప్రమాదం
డీజిల్ కొరతతో నిలిచిపోతున్న వాహనాలు
అరకొర సేవలతో బాలింతల అవస్థలు
రెండు నెలలుగా డ్రైవర్ల జీతాల బకాయిలు
ఉమ్మడి జిల్లాలో 32 వాహనాలు
రోజుకు 200 మంది తల్లీబిడ్డలను ఇంటికి చేరుస్తున్న వైనం
సమస్యల పరిష్కారానికి నేడు సమ్మెకు పిలుపు

తల్లీబిడ్డ సేవలకు సుస్తీ