
సంతలో పశువుల్లా కొన్నారు
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
అత్తిలి: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, సంతలో పశువుల మాదిరిగా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను కొనుగోలు చేసి, ఎంపీపీ స్థానాన్ని గెలిపించుకున్నామని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు దుయ్యబట్టారు. సోమవారం అత్తిలిలోని తన నివాసంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అత్తిలి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఉప ఎన్నికలు మార్చి 27న జరగాల్సి ఉండగా కూటమి శ్రేణులు అడ్డుకున్నారని విమర్శించారు. తిరిగి మరలా సోమవారం ఎన్నికలు జరగ్గా వైఎస్సార్‌సీపీకి చెందిన ఏడుగురు ఎంపీటీసీ సభ్యులను ఎమ్మెల్యే రాధాకృష్ణ కొనుగోలు చేసి ఎంపీపీ స్థానాన్ని గెలవడం సిగ్గుచేటన్నారు. ఇది సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు.
దమ్ముంటే రాజీనామా చేయించండి
ఎమ్మెల్యేకు దమ్ము, ధైర్యం ఉంటే వెంటనే వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లినవారితో రాజీనామా చేయించి, తిరిగి ఎన్నికలకు సిద్ధం కావాలని, అప్పుడు తెలుస్తుంది ఎవరి సత్తా ఏమిటో అని మాజీ మంత్రి కారుమూరి సవాల్ చేశారు. ఎంపీపీగా గెలిచామని చెప్పుకొంటున్న మక్కా సూర్యనారాయణ ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడేనని గుర్తుచేశారు.
అంబులెన్సులో
తరలించడం పిరికిపంద చర్య
ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీ సభ్యులను ఎమ్మె ల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ.. అంబులెన్స్ వాహనంలో మండల పరిషత్ కార్యాలయానికి తీసుకురావడం పిరికిపంద చర్యగా కారుమూరి అభివర్ణించారు. ఎంపీపీ ఎన్నికల్లో విష సంస్కృతికి కూటమి నాయకులు తెరతీశారన్నారు. వైఎస్సార్‌సీపీలో ఉన్న ఎంపీటీసీ సభ్యులు నిజాయతీపరులు, ఆణిముత్యాలు అని, మాజీ సీఎం జగన్ గుండెల్లో వారికి ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. తణుకు నియోజకవర్గాన్ని జూద క్రీడలకు నిలయంగా ఎమ్మెల్యే మార్చివేశారన్నారు. ప్రతి పనికీ ఆర్‌కే ట్యాక్స్ పేరుతో అక్రమ వసూళ్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బుద్ద రాతి భరణీ ప్రసాద్, పార్టీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు రంభ సుజాత, దారం శిరీష, అనిశెట్టి త్రిమూర్తులు, అద్దంకి శ్రీను, నల్లమిల్లి నాగమణి, గుడిమెట్ల ధనలక్ష్మి, ఆడారి శ్రీనివాసరావు, దొమ్మేటి రమ్య, నాయకులు రంభ సూరిబాబు, పెన్మెత్స రామరాజు, పోలినాటి చంద్రరావు, మద్దాల శ్రీనివాస్, కంకటాల సతీష్, సబ్బితి రాజేష్, కోరుకొల్లు వెంకట్రావు, రామిశెట్టి రాము పాల్గొన్నారు.