
పని భారంపై వీఆర్‌వోల నిరసన
కొయ్యలగూడెం: క్లస్టర్ విధానంలో రేషనలైజేషన్ పేరుతో విడుదల చేసిన జీవో నెంబర్–4 విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని వీఆర్‌వో అసోసియేషన్ డివిజనల్ అధ్యక్షుడు అడపా రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్‌వోలు నిరసన కార్యక్రమం చేపట్టారు. రెండు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్‌గా నిర్ణయిస్తూ దానికి ఒక వీఆర్‌ఓని మాత్రమే నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని వీఆర్‌వో అసోసియేషన్ ఖండించింది. ఒక్కో సచివాలయానికి మిగిలిన శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులను ఒక్కొక్కరిని నియమిస్తూ, రెవెన్యూ వ్యవస్థ వచ్చేసరికి రెండు సచివాలయాలకు కలిపి ఒకరినే నియమించడం వల్ల తీవ్రమైన పనిభారం, ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుందంటూ పేర్కొన్నారు. ఇప్పటికే ఒక సచివాలయంలోనే ఉన్న విధులను నిర్వహించడానికి తీవ్రమైన మానసిక ఒత్తిడికి ఎదుర్కొంటుండగా రెండు సచివాలయాలను కలపడం అన్యాయం అన్నారు. అనంతరం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తహసీల్దార్ కె.చెల్లన్నదొరకు వినతిపత్రం సమర్పించారు. వీఆర్‌వోలు కె.మధు, బట్టు వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.