
ఆక్రమిత భూముల పరిశీలన
పాలకోడేరు : మండలంలోని గొల్లలకోడేరులో యనమదుర్రు డ్రెయిన్ గట్టుపై ఉన్న ఆక్రమిత స్థలాలను కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం నేరమని, త్వరలో ఆక్రమణల స్వాధీనానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం గ్రామంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఆమె పరిశీలించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు చేపడతామని నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఆర్డీఓ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, తహసీల్దార్ ఎన్.భారతి విజయలక్ష్మి, ఎంపీడీఓ వి.రెడ్డియ్య, ఇరిగేషన్ డీ తదితరులు ఉన్నారు.
నిమ్మకు గిట్టుబాటు ధర కల్పించాలి
ఏలూరు (టూటౌన్): నిమ్మకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక అన్నే భవనంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ నిమ్మకాయల ధర పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి నుంచి మే వరకు నిమ్మకు అధిక ధర ఉండే సమయమని, అయినా ప్రస్తుతం ధర తగ్గిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరోవైపు ఈదురుగాలులు, అకాల వర్షాలతో నిమ్మ రైతులు నష్టపోతున్నారన్నారు. నిమ్మ ఎగుమతులు సక్రమంగా లేకపోవడం కూడా నష్టాలకు కారణంగా ఉందని, ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. కిలో నిమ్మకాయలకు రూ.100 ధర రావాల్సి ఉండగా రూ.30లోపు మాత్రమే ఉందన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, జిల్లా కమిటీ సభ్యుడు జి.సురేష్ పాల్గొన్నారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 629 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులోని రెండు కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు 629 మంది విద్యార్థులు హాజరయ్యారు. సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 180 మందికి 175 మంది, మధ్యాహ్నం 180 మందికి 174 మంది హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 144 మందికి 140 మంది, మధ్యాహ్నం 144 మందికి 140 మంది హాజరయ్యారు.
ఘనంగా గంగాదేవి అమ్మవారి జాతర
పాలకోడేరు: మోగల్లు గ్రామంలో గంగాదేవి అమ్మవారి జాతర ఆదివారం ఘనంగా జరిగింది. జాతరకు సినీ హీరో నిఖిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి గ్రామానికి బంధువులు తరలివచ్చారు. గ్రామస్తులతో పాటు బంధువులు ఆలయంలో అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేయించారు. చలిమిడి పానకాలతో మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో మేళతాళాలు కోయ డ్యాన్సులు, బాణసంచా కాల్పులతో అమ్మవారి ఊరేగింపు నేత్రపర్వంగా సాగింది. హీరో నిఖిల్‌ను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. ఎస్సై మంతెన రవి వర్మ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు.

ఆక్రమిత భూముల పరిశీలన

ఆక్రమిత భూముల పరిశీలన

ఆక్రమిత భూముల పరిశీలన