
ఆర్టీఏ లైసెన్స్ తప్పనిసరి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేంద్ర ప్రభుత్వం రూపొందించిన క్యారేజ్ బై రోడ్ యాక్ట్ – 2007, క్యారేజ్ బై రోడ్ రూల్స్ – 2011 ప్రకారం వినియోదారుల నుంచి స్వీకరించిన పార్సిళ్లను స్టోర్ చేసి, వాటిని గమ్యస్థానాలకు చేరవేసే రవాణా సంస్థలు తప్పనిసరిగా ఆర్టీఏ కార్యాలయం నుంచి లైసెన్స్ పొందాలని ఉప రవాణా కమిషనరు షేక్ కరీం తెలిపారు. శుక్రవారం స్థానిక డీటీసీ కార్యాలయంలో జిల్లాలోని అన్ని పార్సిల్ రవాణా సంస్థల యాజమాన్య ప్రతినిధులతో డీటీసీ కరీం సమావేశం నిర్వహించి, వారికి చట్టంపై అవగాహన కల్పించారు. సోమవారం నాటికి జిల్లాలోని అన్ని పార్సిల్ రవాణా సంస్థలు ఆర్టీఏ లైసెన్స్ పొందాలని, లేనిపక్షంలో వాహనాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేస్తామన్నారు. సమావేశంలో వాహన తనిఖీ అధికారులు ఎన్‌డీ విఠల్, ఎస్‌బీ శేఖర్, పీ. రమేష్ బాబు, పార్సిల్స్ రవాణా సంస్థల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.