
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం రాత్రి సందర్శించారు. సతీసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. న్యాయమూర్తి సుబ్బారెడ్డి దంపతులు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలకగా, ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణమూర్తి స్వామివారి మెమెంటో, ప్రసాదాలను అందజేశారు. న్యాయమూర్తి వెంట భీమడోలు కోర్టు జడ్జి ఎస్.ప్రియదర్శిని నూతక్కి ఉన్నారు.
ప్రశాంతంగా సప్లిమెంటరీ పరీక్షలు
భీమవరం: జిల్లాలోని 40 కేంద్రాల్లో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు 91 శాతం విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎ.నాగేశ్వరరావు తెలిపారు. ఫస్టియర్ జనరల్ కేటగిరీలో 4,844 మందికి 4,477 మంది, ఒకేషనల్ కేటగిరీలో 645 మందికి 569 మంది హాజరయ్యారన్నారు. సెకండియర్ జనరల్ కేటగిరీలో 903 మందికి 810 మంది, ఒకేషనల్ కేటగిరీలో 146 మందికి 125 మంది హాజరయ్యారని, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు.
వెబ్‌సైట్‌లో వాహన పన్ను చెల్లించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని వాహన యజమానులు త్రైమాసిక పన్నును వెబ్‌సైట్‌లో చెల్లించాలని జిల్లా రవాణా శాఖ అధికారి టి.ఉమామహేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. జూన్ 30లోపు పన్ను చెల్లించకుంటే 25 శాతం అపరాధ రుసుం విధిస్తామన్నారు. పన్ను చెల్లించకుండా తిరిగితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు 200 శాతం పెనాల్టీ పడుతుందని పేర్కొన్నారు. అలాగే పాఠశాలల బస్సుల ఫిట్‌నెస్ ధ్రువీకరణ పొందిన తర్వాతే విద్యార్థులను బస్సుల్లో తీసుకువెళ్లాలని సూచించారు.
రోడ్డు భద్రతకు పటిష్ట చర్యలు
భీమవరం (ప్రకాశం చౌక్): రోడ్డు భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టి, ప్రమాదాలు నివారణకు కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలను ఉపేక్షించబోమని, స్కానింగ్ కేంద్రాలపై డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్‌లో పీసీ–పీఎన్‌డీటీ యాక్ట్, ఏఆర్టీ అండ్ సరోగసి యాక్ట్ అమలుపై ఆమె సమీక్షించారు. అలాగే మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాలపై కలెక్టర్ సమీక్షించారు.
లభ్యం కాని బాలుడి వివరాలు
ద్వారకాతిరుమల: స్థానిక యూనియన్ బ్యాంకు సమీపంలో ఈనెల 9న ఒంటరిగా తిరుగుతూ కనిపించిన ఐదేళ్ల బాలుడిని స్థాని కులు పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. బాలుడు తన పేరు గోపాల్ అని, తండ్రి పేరు నాయక్ అని మాత్రమే చెబుతు న్నాడు. అంతకు మించి వివరాలు చెప్పలేకపోవడంతో బాలుడిని ఏలూరులో జిల్లా శిశు గృహానికి తరలించి, తాత్కాలిక వసతి కల్పిస్తున్నట్టు డీసీపీఓ సీహెచ్ సూర్య చక్రవేణి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. బాలుడి వివరా లు తెలియలేదని, ఎవరికైనా తెలిస్తే సెల్ 94910 63810, లేదా ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ 94407 96653, చైల్డ్ హెల్ప్‌లైన్ కో–ఆర్డినేటర్ వైవీ రాజు 77027 48404 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు.
కన్న తండ్రినే కడతేర్చాడు
దెందులూరు: కుమారుడు దాడి చేయడంతో తండ్రి మృతి చెందిన ఘటన మండలంలోని ఉండ్రాజవరంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఉండ్రాజవరం గ్రామానికి చెందిన అంబల్ల సింహాచలం (72)పై అతడి పెద్ద కుమారుడు సన్యాసిరావు రోకలి బండతో దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలైన సింహాచలం అక్కడికక్కడే మృతిచెందాడు. సన్యాసిరావు తరచుగా తండ్రితో గొడవ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఇంటి వద్ద ఉన్న సింహాచలంతో గొడవ పడి రోకలి బండతో మోదడంతో సింహాచలం అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘట నా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు