
సైబర్ కేసును చేధించిన పోలీసులు
తాడేపల్లిగూడెం: సైబర్ మోసం కేసును గూడెం పట్టణ పోలీసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని కొబ్బరితోటకు చెందిన పోపూరి సాంబశివప్రసాద్ ను కొందరు డిజిటల్ అరెస్టు అంటూ ఫోన్‌లో బ్లాక్‌మెయిల్ చేశారు. ప్రసాద్ వద్ద నుంచి రెండు బ్యాంకు శాఖల ద్వారా రూ.50 లక్షలు బదిలీ చేయించుకున్నారు. తనను కొందరు మోసం చేశారని గ్రహించిన ప్రసాద్ గూడెం పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ ఎ.సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఎస్సై బాదం శ్రీనివాసు, సిబ్బంది రాజస్థాన్ వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని జలోర్ జిల్లా బాగోడా మండలం బాలనికి చెందిన హనుమాన్‌రామ్, బార్మర్ జిల్లా సోనారి గ్రామానికి చెందిన దినేష్‌ను అరెస్టు చేశారు. నిందితులు రాజస్థాన్‌లోని ఒక పెట్రోలు బంకు ఓనర్ పీఓఎస్ మిషన్ నుంచి రూ.7 లక్షలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో అప్రమత్తమైన పోలీసులు బ్యాంకు అధికారుల ద్వారా రూ.10 లక్షలు హోల్డ్‌లో పెట్టించి, రూ.20 లక్షల ఎఫ్‌డీలు బ్రేక్ అవ్వకుండా చేశారు. ఈ విషయంలో కీలకంగా వ్యవహరించిన హెచ్‌డీఎఫ్‌సీ మేనేజర్‌ను ఎస్పీ అభినందించారు.