ఏలూరులో సింగిల్ చిత్ర బృందం సందడి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గీత ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సింగిల్ చిత్ర బృంద సభ్యులు మంగళవారం ఏలూరులో సందడి చేశారు. హీరో శ్రీ విష్ణు, హీరోయిన్లు కేతిక శర్మ, ఇవానా నటించిన సింగిల్ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమౌతున్న నేపథ్యంలో చిత్ర బృందం నగరంలోని ఎస్‌వీసీ థియేటర్‌లో ప్రేక్షకులను కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా చిత్రంలోని డైలాగులను చెప్పి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. తమ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేసిన ప్రేక్షకులకు చిత్ర యూనిట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో శ్రీ విష్ణు, దర్శకుడు కార్తీక్ రాజు మాట్లాడారు. మంచి కామెడీతో పాటు కుటుంబ సమేతంగా చూసే విధంగా చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. సమావేశంలో హాస్య నటుడు వెన్నెల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


