
భూవివాదంలో జనసేన శ్రేణులు
స్థానికుల ఫిర్యాదుతో ఎమ్మెల్యే మందలింపు
కొయ్యలగూడెం: భూవివాదంలో జనసేన పార్టీ శ్రేణుల వ్యవహారంపై స్థానికులు ఎమ్మెల్యేని చుట్టుముట్టి తమపై జరిగిన దౌర్జన్యాన్ని వివరించిన ఘటన కొయ్యలగూడెంలో సోమవారం జరిగింది. దీంతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జనసేన శ్రేణులను మందలించడం కనిపించింది. తహసీల్దార్ కే చెల్లన్న దొరతో కలసి కొయ్యలగూడెంలోని వివాదాస్పద భూమి వద్దకు వచ్చిన ఆయన జాతీయ రహదారికి పక్కన ఉన్న కోట్ల రూపాయల విలువైన ఆ భూమి వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థలం తమదంటూ బయటి వ్యక్తులు వచ్చారని, వారికి మద్దతుగా జనసేన, టీడీపీ నాయకులు ఉన్నారని స్థానికులు ఎమ్మెల్యేకి వివరించారు. తమ పార్టీలోని కొందరు తనకు తెలియకుండా వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వివాదాస్పద ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఇబ్బంది కలిగించబోమని ఎమ్మెల్యే చెప్పారు. అదే సమయంలో వివాదానికి సంబంధించిన వ్యక్తుల్లో ఒకరు ఎమ్మెల్యే సమక్షంలో అక్కడే ఉండటం.. అతనిపై మహిళలు దాడికి యత్నించడం గమనార్హం. ఈ క్రమంలో ఎస్సై వి.చంద్రశేఖర్ సిబ్బందితో కలసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.