అకాల వర్షంతో అంతటా నష్టం | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షంతో అంతటా నష్టం

Apr 15 2025 2:13 AM | Updated on Apr 15 2025 2:13 AM

అకాల

అకాల వర్షంతో అంతటా నష్టం

కై కలూరు: అకాల వర్షాలతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం రాత్రి వీచిన ఈదురుగాలులు, వర్షానికి పలుచోట్ల వరిచేలు, మామిడి చెట్లు నేలకొరిగాయి. విద్యుత్‌ తీగలు తెగిపోవడంతో పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడి ప్రజలు అవస్థలు పడ్డారు. ప్రధానంగా విపరీతమైన ఈదురు గాలులు.. వడగండ్ల వర్షంతో కై కలూరు నియోజకవర్గం చిగురుటాకులా వణికిపోయింది. ఆదివారం రాత్రి నుంచి వీచిన గాలులకు విద్యుత్‌ వైర్లు తెగిపడడంతో పాటు దాదాపు 192 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ప్రజలు చిమ్మచీకట్లలో బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడిపారు. ప్రధానంగా విద్యుత్‌శాఖకు భారీ నష్టం కలిగింది. ఆక్వా చెరువులపై విద్యుత్‌ స్తంభాలు ఎక్కువగా కూలబడ్డాయి. మండవల్లి మండలం పుట్లచెరువు వద్ద ఏపీ ట్రాన్స్‌కోకు చెందిన టవర్‌ నేలకూలింది. దీంతో మరో టవర్‌ నుంచి విద్యుత్‌ను మళ్లించారు. కై కలూరు టౌన్‌, రూరల్‌, కలిదిండి, మండవల్లి, ముదినేనపల్లి మండలాల్లో అనేక ప్రాంతాల్లో చెట్లు విద్యుత్‌ తీగలపై పడ్డాయి. ఎక్కువ నష్టం కలిదిండి మండలంలో జరిగింది. కై కలూరు టౌన్‌లో గాలులకు వైర్లు తెగిపడ్డాయి. అనేక దుకాణా బోర్డులు ఊడి రోడ్లపై పడ్డాయి. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పిల్లలు ఫ్యాన్లు తిరగక దోమలతో నరకయాతన అనుభవించారు. ప్రభుత్వాసుపత్రిలో రోగులు ఇబ్బందులు పడ్డారు. చార్జింగ్‌లు లేక సెల్‌ఫోన్లు మూగబోయాయి. విద్యుత్‌ సరఫరా యుద్ధప్రాతిపాదికన పునరుద్ధరిస్తున్నామని విద్యుత్‌శాఖ డీఈ రామయ్య చెప్పారు. ఇదిలా ఉండగా కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామ సమీప కొత్తమాలపల్లిలో ఆదివారం రాత్రి ఈదురుగాలులు వీస్తున్న సమయంలో మేకా ఆదిలక్ష్మి (45) అనే మహిళ బయట వంట సామాగ్రి తీయడానికి వెళ్లగా ఆమైపె తాడిచెట్టు పడింది. కై కలూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు.

పూరి–తిరుపతి రైలుపై కూలిన వృక్షం

కై కలూరు రైల్వేస్టేషన్‌లో ఆదివారం రాత్రి ప్రయాణికుల కోసం నిలిచిన పూరి–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలు పైన, విద్యుత్‌ తీగలపై స్టేషన్‌లో భారీ వృక్షం పడింది. ఆ సమయంలో ఈదురు గాలులకు విద్యుత్‌ సరఫరా లేదు. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు భయపడ్డారు. కొందరు రోడ్డు మార్గాన వెళ్లిపోయారు. రైల్వే శాఖ మూడు గంటలు శ్రమించి విద్యుత్‌ వైర్లను పునరుద్ధరించింది. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈకారణంగా గుడివాడ– భీమవరం రూటులో రైళ్లను దారి మళ్లించారు.

నేలకూలిన వృక్షం

కాళ్ల: కాళ్ళ మండలంలో ఆదివారం అర్ధరాత్రి కురిసిన భారీవర్షం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఒకపక్క కోతదశకు వచ్చిన వరిచేలు నేలకొరిగి నీటమునిగాయి. మరోపక్క ఆక్వా రైతులకు కునుకు లేకుండా పోయింది. తీవ్రంగా వీచిన గాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. కాళ్ళ నుంచి భీమవరం వెళ్లే దారిలో జక్కరం వద్ద తెల్లవారుజామున భారీవృక్షం రాష్ట్రీయ రహదారిపై కూలడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆ సమయంలో ఎవరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. సోమవారం వృక్షాన్ని తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు.

రైతన్న బెంబేలు

గణపవరం: ఆదివారం రాత్రి ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా మారి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రబీ రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే అప్పటికే పగటి పూట ఎండబెట్టిన ధాన్యాన్ని సాయంత్రం రాశులుచేసి తడవకుండా బరకాలు, టార్ఫాలిన్‌లు కప్పి ఉంచడంతో వర్ష ప్రభావం పెద్దగా నష్టం చేయలేదు. కొంతమేర తడిసిన ధాన్యాన్ని రైతులు సోమవారం ఉదయం నుంచి ఎండబెట్టుకున్నారు. ఇక కోతలు కోయడానికి సిద్ధమైన రైతులు ఆఘమేఘాలపై వరికోతలు పూర్తిచేసి ధాన్యం రాశులు సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్నారు. వర్షంనీరు చేలల్లో చేరడంతో రైతులు సోమవారం ఉదయం నుంచే చేలల్లో చేరిన నీటిని బయటకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.

దెబ్బతిన్న మామిడి తోటలు

నరసాపురం రూరల్‌: నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని మామిడి, వరి పంటలు ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలులు, అకాల వర్షంతో దెబ్బతిన్నాయి. నియోజకవర్గంలోని నరసాపురం, మొగల్తూరు మండాల్లో సుమారు రెండు వేలకు పైగా ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. మొగల్తూరు, ముత్యాలపల్లి, పేరుపాలెం, మోడి, రుస్తుంబాద, సీతారామపురం, తూర్పుతాళ్లు, లక్ష్మణేశ్వరం, పసలదీవి, తదితర ప్రాంతాల్లో మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ఆది నుంచి మామిడి రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చెట్లు మామిడిపూత సమయంలో బాగానే ఉన్నా తేనె మంచు కురవడంతో పూచిన పూత అంతా మాడిపోయింది. దీంతో ఉన్న కొద్దిపాటి పూత, పిందెలను నిలుపుకునేందుకు ఇప్పటికే ఐదారుసార్లు వివిధ క్రిమి సంహారక మందులు పిచికారి చేయడంతో కొంతమేర కాయ నిలబడింది. అయితే ఒక్కసారిగా ఆదివారం రాత్రి కురిసిన భారీగాలులతో కూడిన వర్షానికి మామిడితో పాటు వరి చేలు కూడా నేలనంటాయి.

కై కలూరులో నేలకొరిగిన 192 విద్యుత్‌ స్తంభాలు

పూరి–తిరుపతి రైలుపై కూలిన వృక్షం

పలు మండలాల్లో నేలకొరిగిన వరిచేలు

అకాల వర్షంతో అంతటా నష్టం1
1/1

అకాల వర్షంతో అంతటా నష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement