
పంట నష్టం.. పరిహారం కష్టం
కుక్కునూరు: ప్రకృతి ప్రకోపానికి విలీన మండలాల్లోని రైతులు ప్రతి ఏడాది సాగులో నష్టాన్ని చవిచూస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో బ్యాక్ వాటర్ ప్రభావం తీవ్రంగా ఉండడంతో సరైన సమయానికి పంటలు వేయడంలో కూడా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ సమయానికి విత్తనాలు వేసినా అవి మొలకెత్తే దశలో ఉన్నప్పుడు వర్షాలు కురవకపోవడం, భారీ వర్షాలతో పంటలు ముంపు బారిన పడడం ఇలా ఏదో రూపంలో రైతులు పంటనష్టాన్ని ఎదుర్కోక తప్పని పరిస్థితి. వీటన్నింటిని దాటినా దిగుబడి సమయానికి పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం ఇలా ప్రతి ఏడాది విలీన రైతులు వ్యవసాయ సీజన్ ప్రారంభం నుంచి సాగు ముందుకు సాగుతుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులతో తాము అప్పుల పాలవుతున్నామని చిన్న సన్నకారు రైతులు వాపోతున్నారు. పోని నష్టాల బారిన పడిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందా అంటే పోలవరం పరిహారం ఇచ్చామన్న పేరుతో నష్టపరిహారాన్ని కూడా ఇవ్వకుండా గాలికొదిలేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్ ముంపునకు గురవుతున్న భూములకు 2017లో అప్పటి ప్రభుత్వం భూ పరిహారాన్ని చెల్లించింది. ప్రభుత్వం పరిహారం చెల్లించి దాదాపు ఏడేళ్లు కావస్తున్నా ఈ రోజు వరకు ఆర్‌అండ్‌ఆర్ పరిహారం చెల్లించలేదు. అప్పటి నుండి ఇచ్చిన పరిహారం తింటూ కూర్చోమనడం ఎంతవరకు న్యాయమని రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సేకరించిన భూములను సాగు చేసుకుంటున్నారు. పోని సాగు ఆపుదామా అంటే కూర్చొని తింటే ఎంతైనా కరిగిపోతాయన్న ఆవేదన నిర్వాసిత రైతుల్లో నెలకొంది. తమ సమస్యను ప్రజాప్రతినిధులకు వివరిస్తే వారేమో మీకు ప్యాకేజీ డబ్బులు ఇస్తాం.. ఆవేదన చెందొద్దు, మీరంతా త్యాగధనులు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలివ్వడం తప్ప సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టింది శూన్యం. ఇలా సాగులో నష్టాలు చవిచూస్తున్న రైతులు కుటుంబపోషణ భారమై పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం అప్పుల బాట పట్టాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలతో ఇతర ప్రాంతాల రైతులను ఎలాగైతే నష్టపరిహారాన్ని అందించి ఆదుకుంటుందో అదేవిధంగా పోలవరం పరిహారంతో సంబంధం లేకుండా విలీనమండలాల రైతులకు నష్ట పరిహారాన్ని అందించి ఆదుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రకృతి ప్రకోపంతో నిండామునుగుతున్న విలీన రైతు
భూములకు పరిహారం చెల్లించామన్న పేరుతో ఆదుకోని ప్రభుత్వం
పంట నష్టపోయి గగ్గోలు పెడుతున్న విలీన రైతులు

పంట నష్టం.. పరిహారం కష్టం