ఓట్ల లెక్కింపులో ఏజెంట్ల పాత్ర కీలకం | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపులో ఏజెంట్ల పాత్ర కీలకం

Published Fri, May 31 2024 1:18 AM

ఓట్ల లెక్కింపులో ఏజెంట్ల పాత్ర కీలకం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/దెందులూరు: సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. మరో నాలుగు రోజుల్లో అంటే జూన్‌ 4న కౌంటింగ్‌ జరగనుంది. ఫలితాలపై ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ప్రజల తీర్పు ఏ అభ్యర్థికి అనుకూలంగా ఉందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనే ఏజెంట్లకు అధికారులు మార్గదర్శకాలను ఇప్పటికే సూచించారు. కౌంటింగ్‌ నిబంధనలపై ఏజెంట్లను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, వారికి కౌటింగ్‌ నిబంధనలపై అవగాహన కల్పించడానికి ఇప్పటికే పోటీ చేసిన అభ్యర్థులకు, వారికి సంబంధించిన చీఫ్‌ ఏజెంట్లకు రెండు విడతల్లో శిక్షణ ఇచ్చారు.

ఏజెంట్‌గా అర్హతలివే..

కౌంటింగ్‌ ఏజెంట్‌కు 18 ఏళ్లు నిండి ఉండాలి. సాయుధ రక్షణ కలిగి ఉన్న వారిని అనుమతించరు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, అన్ని పబ్లిక్‌ రంగ సంస్థలు, కార్పొరేషన్‌ చైర్మన్లు కూడా ఏజెంట్లుగా అనర్హులు. ప్రభుత్వం నుంచి గౌరవవేతనం పొందేవారు, ప్రభుత్వ, ఎయిడెడ్‌ సంస్ధల్లో పనిచేసే పార్ట్‌టైం ఉద్యోగులు, పారా మెడికల్‌ స్టాఫ్‌, రేషన్‌ డీలర్లు, అంగన్‌వాడీ ఉద్యోగులు పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు ఏజెంట్లుగా వ్యవహరిస్తే మూడు నెలలు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. సర్పంచ్‌లు, పంచాయతీ వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఏజెంట్లుగా వ్యవహరించేందుకు ఎలాంటి అభ్యతరం ఉండదు. భారత పౌరసత్వం కలిగిన ఎన్‌ఆర్‌ఐకు కూడా అర్హత ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి తనకు గన్‌మెన్‌ను స్వచ్ఛందంగా వదులుకుంటే కౌంటింగ్‌ హాలులో కూర్చొనేందుకు అనుమతి ఇస్తారు. ఒక కౌంటింగ్‌ హాలులో 14 టేబుల్స్‌ ఉంటాయి. ఆ మేరకు అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకోవచ్చు. పోస్టల్‌ బ్యాలెట్లకు లెక్కింపు అవసరాలు భావిస్తే అందుకోసం వేరే కౌంటింగ్‌ హాలులో అదనపు టేబుళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదనంగా మరో కౌంటింగ్‌ ఏజెంటును నియమించుకోవచ్చు.

ఫారం–17సీపై అవగాహన అవసరం

కౌంటింగ్‌ సమయంలో టేబుల్‌ వద్దకు కంట్రోల్‌ యూనిట్‌తో పాటు ఫారం–17 సీలోని వివరాలను ఏజెంట్లు తప్పనిసరిగా రాసుకోవాలి. కంట్రోల్‌ యూనిట్‌ డిస్‌ప్లే సెక్షన్‌లో చూసిన పోలైన మొత్తం ఓట్లు ఫారం–17 సీలో నమోదు చేసిన ఓట్ల సంఖ్యతో సమానంగా ఉండాలి. క్లరికల్‌ తప్పిందంతో కాని కంట్రోల్‌ యూనిట్‌ ఫారం–17 సీలో ఓట్ల సంఖ్యతో తేడా వస్తే అది వివాదాస్పదంగా మారుతుంది. అలాంటి కంట్రోల్‌ యూనిట్లను రిటర్నింగ్‌ అధికారిని పక్కన ఉంచి ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందిస్తారు. కంట్రోల్‌ యూనిట్‌ టేబుల్‌పైకి రాగానే ఏజెంట్లు పరిశీలనకు వస్తారు. ఆ కంట్రోల్‌ యూనిట్‌ను ఏ పోలింగ్‌ కేంద్రానికి చెందిందో ఏజెంట్లు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement