
పాలకొల్లు అర్బన్: టిడ్కో గృహాల్లో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తలపెట్టిన వంటావార్పు కార్యక్రమాన్ని పోలీసులు నిలుపుదల చేయడంతో మీడియాలో ప్రచారం కోసం చీప్ ట్రిక్కులకు తెరలేపారని వైఎస్సార్ సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో గృహాల సముదాయంలో వారం రోజుల్లో పల్లె నిద్ర చేసి గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో లబ్ధిదారులను ఎలా మోసం చేసిందో వివరిస్తామన్నారు. పాలకొల్లు ఏఎంసీ అతిథి గృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పల్లె నిద్రలో బ్యాంక్ మేనేజర్లతో పాటు లీగల్ అడ్వైజర్‌ని కూడా రప్పించి వాస్తవాలు తెలియజేస్తామ న్నారు. ఎమ్మెల్యే నిమ్మలకు ధైర్యం ఉంటే నిజనిర్ధారణకు చర్చావేదికకు రావాలని సవాల్ విసిరారు. ఈనెల 8న పాలకొల్లులో జరిగిన వైఎస్సార్ సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు అనూహ్య స్పందన రావడంతో జీర్ణించుకోలేక ఎమ్మెల్యే నిమ్మల చౌకబారు విమర్శలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిడ్కో గృహాల్లో ప్లంబింగ్, వాటర్ పైపులైన్‌లు, మురుగు డ్రెయిన్‌లు, మంచినీటి కుళాయి పైపులైన్‌లు, మరుగుదొడ్లు, రంగుల పనులు పూర్తి చేసి 1,756 మందికి ఫ్లాట్‌లు అప్పగించిందన్నారు. చంద్రబాబు, ఎమ్మెల్యే నిమ్మల కమీషన్లకు కక్కుర్తిపడి పనులను నాసిరకంగా చేయించడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారన్నారు. నెలాఖరుకు మరికొన్ని ఫ్లాట్‌లను లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీ మేరకు 300 చదరపు అడుగుల గృహాలను ఉచితంగా అందించారని, దీని కోసం రూ.129 కోట్లను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించిందన్నారు. అలాగే 365, 437 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులకు చెల్లించిన సొమ్ములో 50 శాతం రాయితీలిచ్చారని గుడాల గోపి వివరించారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లెం ఆనందప్రకాష్, పార్టీ పరిశీలకులు గుణ్ణం నాగబాబు, యడ్ల తాతాజీ, మండల పరిషత్ మాజీ ప్రతిపక్షనేత చిట్టూరి ఏడుకొండలు, పార్టీ మండలాల కన్వీనర్లు విప్పర్తి ప్రభాకరరావు, పొత్తూరి బుచ్చిరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ సాలా నరసయ్య, పార్టీ నాయకులు పాల్గొన్నారు.