జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి వద్ద నిరసన తెలుపుతున్న శిశువు కుటుంబసభ్యులు
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన మగ శిశువు మృతి చెందడంపై బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం పురిటి నొప్పులతో ఆసుపత్రికి వస్తే ఆపరేషన్ చేసి మృతిచెందిన శిశువును అప్పగించారని బాధితులు వాపోయారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక రాజీవ్ నగర్‌కు చెందిన సజ్జ మురళీకృష్ణ కుమార్తె హేమలతకు రాజమండ్రికి చెందిన ఉల్లి వీరబాబుతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. గతంలో ఒక బిడ్డ పుట్టగా.. రెండో బిడ్డ పురిటి కోసం హేమలతను జంగారెడ్డిగూడెం తీసుకువచ్చారు. శనివారం హేమలతను ఏరియా ఆసుపత్రికి తీసుకువస్తే ఇంజక్షన్ ఇచ్చి ఆదివారం ఇంటికి పంపారని హేమలత కుటుంబసభ్యులు తెలిపారు. గురువారం హేమలతకు నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకువచ్చామని తెలిపారు. ఆపరేషన్ చేసి పండంటి మగ బిడ్డకు అందిస్తారని ఆశతో ఎదురుచూస్తున్నామని, తమకు మృతి చెందిన మగ శిశువును చేతుల్లో పెట్టారని కన్నీటిపర్యంతమయ్యారు. ఆసుపత్రి వద్ద బైఠాయించి న్యాయం చేయాలని నిరసన తెలిపారు. ఈ సంఘటనపై ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల స్పందిస్తూ.. హేమలతను గత శనివారం ఆసుపత్రికి తీసుకురాగా పరీక్షించినట్టు తెలిపారు. నెలలు పూర్తిగా నిండకపోవడంతో మందులు ఇచ్చి ఇంటికి పంపామన్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు నొప్పులతో బాధపడుతున్న హేమలతను ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు. హేమలత నొప్పులతో బాధపడటం చూసి వెంటనే ఆపరేషన్‌కు సిద్ధం చేశామని తెలిపారు. తల్లి ప్రాణానికి హాని కలగకుండా జాగ్రత్త తీసుకున్నామన్నారు. ఆపరేషన్ చేసే సమయానికి కడుపులో మగ బిడ్డ అప్పటికే మృతి చెంది ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఆస్పత్రికి తీసుకురాక ముందే బిడ్డ మృతి చెందినట్లు తెలిపారు. హేమలత ప్రాణానికి హాని కలగకుండా వెంటనే చికిత్స చేశామని తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం ఎక్కడా లేదని వివరించారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు.


