
అధికారులను ప్రశ్నిస్తున్న కలెక్టర్ ప్రశాంతి
ఆకివీడు: రీ సర్వే ఆలస్యం కావడంపై కలెక్టర్ పి.ప్రశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తరటావ గ్రామంలో రీ సర్వే ప్రాంతాన్ని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ, సర్వే అధికారులతో ఆమె మాట్లాడుతూ జగనన్న భూహక్క–భూరక్షణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని గతంలో ఆదేశించినా సర్వే పనులు జాప్యం కావడం సరికాదన్నారు. గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు, చెక్ పాయింట్లను కచ్చితంగా గుర్తించి, పనులను వేగవంతం చేయాలన్నారు. జిరాయితీ భూమిని పక్కాగా కొలవాలని, రికార్డులు సంపూర్ణంగా ఉండాలన్నారు. స్థానిక జాతీయ రహదారి పక్కన ఉన్న కార్తికేయ జూనియర్ కాలేజీలో ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. పరీక్షలు పక్కాగా నిర్వహించాలని, లోపాలకు తావివొద్దని ఆదేశించారు. తహసీల్దార్ ఎన్.వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జి ఎంపీడీఓ శ్రీకర్ ఆమె వెంట ఉన్నారు.
కచ్చితత్వంతో రీ సర్వే
భీమవరం (ప్రకాశం చౌక్): వ్యవసాయ భూములు, నివాస ప్రాంతాలన్నింటినీ ఒకేసారి రీ సర్వే చేయా లని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆకివీడు మండలంలో జరుగుతున్న రీ సర్వే అధికారులతో సమీక్షించారు. ఆకివీడు మండలం రీ సర్వే పనుల్లో వెనుకబడి ఉందని అసహనం వ్యక్తం చేశారు. సర్వే అధికారులు, టెక్నికల్ సిబ్బంది సమన్వయంతో సర్వే పనుల్లో ప్రగతి చూపాలన్నారు. ఇన్‌చార్జి జేసీ ఎం.సూర్యతేజ, ఆకివీడు తహసీల్దార్ ఎన్.వెంకటేశ్వరరావు, మండల సర్వేయర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.