
ఉపాధి హామీ పథకం పనుల వద్ద ఏర్పాటుచేసిన టెంట్‌లో సేదతీరుతున్న కూలీలు
ఏలూరు(మెట్రో): సూర్యుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చిలోనే మాడు పగిలే ఎండలతో విజృంభిస్తున్నాడు. గతంలో మార్చిలో 32 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు ఉండేవి. ఈ ఏడాదిలో వారం రోజులుగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రానున్న ఏప్రిల్, మే నెలల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.
మూడేళ్లతో పోలిస్తే.. గత మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల శాఖ ఇప్పటికే జిల్లా కలెక్టరేట్‌లకు హెచ్చరికలు జారీ చేసింది. జిల్లా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే రోజుకు 3 నుంచి 4 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
తాగునీటి ఎద్దడి లేకుండా.. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లు వె.ప్రసన్న వెంకటేష్, పి.ప్రశాంతి ఆధ్వర్యంలో ఇప్పటికే గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ, నీటిపారుదల, డ్వామా, పంచాయతీ, జిల్లాపరిషత్ అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే మూగజీవాలకు సైతం నీటి తొట్టెలు ఏర్పాటు చేసి తాగునీరు అందించాలని సూచించారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులను కేటాయించాలని ఆదేశించారు.
‘ఉపాధి’ కూలీలకు.. ఎండ వేడితో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల వద్ద కూలీలు ఇబ్బంది పడకుండా చూడాలని ఆ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాంబాబు ఆదేశించారు. ఉపాధి కూలీల సౌకర్యార్థం షేడ్ నెట్‌లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు పనులు జరిగే ప్రాంతాల వద్ద అందుబాటులో ఉంచారు. ఉపాధి పనులను ఉదయాన్నే ప్రారంభించి ఎండ పెరిగే సమయానికి ముగించేలా, కూలీలు వడదెబ్బకు గురికాకుండా డ్వామా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ముందస్తు హెచ్చరికలు
ఉపాధి కూలీలు, ప్రజలు వడదెబ్బకు గురికాకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జ్వరం ఉండటం, మత్తు, ఫిట్స్, అపస్మారక స్థితి ఇవన్నీ వడదెబ్బ లక్షణాలు కావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి ప్రత్యేక సూచనలు జారీ చేశారు. బయట పనులకు, పొలం పనులకు వెళ్లేవారు ఉదయం 11 గంటలలోపు ఇంటికి చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మార్చిలోనే మండుతోంది
గతం కంటే పెరగనున్న ఉష్ణోగ్రతలు
వాతావరణ శాఖ హెచ్చరికలు
అధికార యంత్రాంగం అప్రమత్తం
‘ఉపాధి’ ప్రాంతాల్లో నీడ ఏర్పాట్లు
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
ప్రత్యేక చర్యలు
రాష్ట్ర వాతావరణ శాఖ ఆదేశాల మేరకు ఇప్పటికే అన్ని శాఖల అధికారులను సమాయాత్తం చేసి తాగునీటి ఎద్దడి లేకుండా చూస్తున్నాం. ఎండల తీవ్రత నేపథ్యంలో ఉపాధి కూలీల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. గతేడాది కంటే ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ సూచన మేరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. – ప్రసన్న వెంకటేష్, కలెక్టర్, ఏలూరు జిల్లా
