వరంగల్ లీగల్: వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని కోర్టు ప్రాంగణంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌కు అపూర్వ స్పందన లభించింది. ముఖ్య అతిథులుగా వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్లు బీవీ నిర్మలా గీతాంబ, ఎం.రామకృష్ణ సునీత హాజరై జాతీయ లోక్ అదాలత్‌ను ప్రారంభించారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 బెంచ్‌లను ఏర్పాటు చేయగా.. వరంగల్–8, నర్సంపేట–2 బెంచ్‌లు ఏర్పాటు చేశారు. మొత్తం 4,489 పెండింగ్ కేసులను పరిష్కరించారు. ఇందులో సివిల్ కేసులు–33, క్రిమినల్ కేసులు 4,456, బ్యాంకు పీఎల్‌సీ కేసులు–34, బీఎస్‌ఎన్‌ఎల్ కేసులు–19, ఎలక్ట్రిసిటీ పియల్‌సీ కేసులు–65, ట్రాఫిక్ ఈ–చలాన్ కేసులు–68,373, సైబర్‌క్రైమ్–15 పరిష్కరించినట్లు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా ముగిసింది. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ న్యాయమూర్తులు నారాయణబాబు, పద్మజ, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాదికార సంస్థ కార్యదర్శులు ఎ.ప్రదీప్, జి.రామలింగం, న్యాయమూర్తులు, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చకిలం ఉపేందర్, చొల్లేటి రామకృష్ణ, బార్‌కౌన్సిల్ మెంబర్ ఎం.సహోదర్‌రెడ్డి, ఇతర న్యాయవాదులు, బెంచ్ మెంబర్లు, వివిధ బ్యాంకు, ఇన్సూరెన్స్ ఉద్యోగులు, కక్షిదారులు పాల్గొన్నారు.
విత్తన విక్రయ షాపుల్లో తనిఖీలు
గీసుకొండ: విశ్వనాథపురం, మచ్చాపూర్, గొర్రెకుంట గ్రామాల్లోని విత్తన విక్రయ షాపులు, గోదాములు, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లను శనివారం ఏడీఏ కల్పన ఆకస్మిక తనిఖీ చేశారు. ఏఓ హరిప్రసాద్‌బాబు, ఎస్‌టీఎల్‌ఏఓ గోవర్ధన్‌రెడ్డితో కలిసి ఆమె పలు షాపుల్లో స్టాక్, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోర్స్ సర్టిఫికెట్ ఉన్న విత్తనాలనే విక్రయించాలని, ధరల పట్టికలు, స్టాక్ వివరాలను తప్పనిసరిగా షాపుల వద్ద ఉండేలా చూసుకోవాలన్నారు. రైతులకు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని, రైతు సంతకం తీసుకోవాలని షాపుల షాపుల నిర్వాహకులను ఆదేశించారు. నకిలీ విత్తనాలను అమ్మినా, నిల్వచేసినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
రాజు మృతిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంటకు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు ల్యాదల రాజు(లవ్ రాజు) మృతిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు శనివారం హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. గత ఏడాది అక్టోబర్ 19న రాజు మృత దేహం లభ్యమైందని, అది ముమ్మాటికీ హత్యే అని మృతదేహంపై ఉన్న గాయాల ఆధారంగా తెలుస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు అతడిది సహజమరణమని తప్పుగా ధ్రువీకరించారని ఆ ఫిర్యాదులో తెలిపారు. సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెస్పీ జాతీయ నాయకులు మంద కుమార్, మండల నాయకులు ఇనుముల పూర్ణయ్య, సీహెచ్ రవి, మృతుడి భార్య ప్రియాంక, కూతురు శ్రేష్ట తదితరులు కమిషన్‌కు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
నర్సంపేట రూరల్: బోలెరో వాహనం ఢీకొని ఒకరు మృతిచెందిన సంఘటన నర్సంపేట మండలంలోని ఆకులతండాలో శనివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నల్లబెల్లి మండలంలోని ముచ్చింపుల గ్రామానికి చెందిన ఎర్రబెల్లి రాజు (50) ద్విచక్రవాహనంపై నర్సంపేట వైపు వెళ్తున్నాడు. నర్సంపేట మండలంలోని ఆకులతండా వద్ద ఎదురు బొలెరో వాహనం వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


