హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి
హన్మకొండ అర్బన్: నీట్–2026ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు ఏర్పాట్లు చేయాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎన్.రవి మాట్లాడుతూ ఈనెల 21న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. దివ్యాంగ అభ్యర్థులకు సాయంత్రం 6.15 గంటల వరకు పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. జిల్లాలోని 12 కేంద్రాల్లో మొత్తం 4,196 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని, అనంతరం గేట్లు మూసివేస్తామని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థుల సౌకర్యార్థం అన్ని పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు, ముఖ్యంగా పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ పరీక్ష కేంద్రానికి కూడా రవాణా సదుపాయం కల్పించినట్లు చెప్పారు. నీట్ జిల్లా సమన్వయ అధికారి భిక్షపతి, ఏసీపీ నరసింహారావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.


