న్యూశాయంపేట/ఖానాపురం: ఖానాపురం మండల పరిధిలోని పాకాలలో అభివృద్ధి పనులను నేడు సీఎం రేవంత్‌రెడ్డి (గురువారం) వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. పాకాలలో ఇటీవల సపారీ వాహనాలు, సైకిళ్లు, పెడల్ బోట్స్‌తో పాటు మరికొన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి పనులు పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా వర్చువల్‌గా సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నట్లు జిల్లా అటవీశాఖాధికారి నిఖిత తెలిపారు.
గుడిసెల్లో ఉండేవారికే ప్రాధాన్యం
దుగ్గొండి: ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో గుడిసెల్లో నివాసం ఉండే పేదవారికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు జెడ్పీ సీఈఓ రాంరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలతో పాటు స్వయంగా బుడిగ జంగాల కాలనీలో ఆయన బుధవారం పర్యటించారు. కాలనీలో 10 మంది ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా ఐదుగురు పరదాలు కట్టుకుని, గుడిసెలు వేసుకుని నివాసం ఉన్నట్లు గుర్తించారు. వారితో స్వయంగా మాట్లాడారు. ఇళ్లు మంజూరు చేస్తాం కట్టుకోవాలని సూచించారు. మరో ఐదుగురు ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు గుర్తించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. స్థానికంగా నివాసం ఉండే అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూడాలని ఎంపీడీఓకు సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరమే మంజూరు పత్రాలు అందించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ లెక్కల అరుంధతి, గ్రామ సర్పంచ్ కామిశెట్టి ప్రశాంత్, హౌసింగ్ ఏఈ ఉపేందర్, పంచాయతీ కార్యదర్శి మహ్మద్ వాజిద్ తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
సంగెం: వానాకాలంలో సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాశ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన బుధవారం సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌ను క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు. విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేదిలేదన్నారు.


