పోలీస్‌వర్గాల్లో చర్చనీయాంశంగా డీజీపీ ప్రకటన
సాక్షిప్రతినిధి, వరంగల్ :
పోలీస్‌శాఖలో పోస్టింగ్‌లు, బదిలీల వ్యవహారంపై డీజీపీ కార్యాలయం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనూ అంతర్గత కసరత్తు ప్రారంభమైనట్లు సమాచారం. హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో ఏళ్ల తరబడి లాఅండ్‌ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, పోలీస్‌స్టేషన్లలో కొనసాగుతున్న అధికారుల వివరాలను పరిశీలిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఒకేచోట పనిచేస్తున్న నల్లగొండ జిల్లాలోని సైదులు అనే ఎస్‌ఐని ఇటీవల ఇతర విభాగాలకు డిప్యుటేషన్‌పై పంపగా.. క్యాన్సల్‌కు ప్రజాప్రతినిధుల ద్వారా పైరవీ చేయడంపై సీరియస్ అయిన డీజీపీ అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ అంశం పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది.
లాఅండ్ ఆర్డరే ముద్దు..
డిప్యుటేషన్లు వద్దు..
సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికై న అధికారి తాను సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందే ముందు హోంశాఖ పరిధి పోలీస్ అనుబంధ విభాగాల్లో డిప్యుటేషన్‌పై పనిచేయడం తప్పనిసరి. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అయిన తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (డీఎస్పీ) పదోన్నతి పొందే ముందు కూడా లూప్‌లైన్ పోస్టింగ్‌లో పనిచేసి ఉండాలి. ఇలా పోలీస్ మాన్యువల్ ప్రకారం ప్రతీ అధికారి ఈ నిబంధనలు అనుసరించాల్సి ఉంది. స్పెషల్ బ్రాంచ్, డీసీఆర్‌బీ/సీసీఆర్‌బీ, సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్, ఇంటలిజెన్స్, సీసీఎస్ తదితర విభాగాల్లో పని చేయాల్సి ఉంది. కానీ, చాలామంది డిప్యుటేషన్లకు దూరంగా శాంతిభద్రతలు, నగర, పట్టణ ఠాణాల పోస్టింగ్‌లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో.. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీజీపీ సీవీ ఆనంద్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేడర్‌లకు చెందిన 1,700 మంది డిప్యుటేషన్లకు దూరంగా కీలక పోస్టింగ్‌లలో కొనసాగినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. వరంగల్ కమిషనరేట్‌తోపాటు ఉమ్మడి జిల్లాలో వివిధ కేడర్లలో పని చేసినవారు, చేస్తున్న వారు వంద మందికిపైనే ఉంటారని చెబుతున్నారు.
కొనసాగుతున్న
వివరాల సేకరణ...
డిప్యుటేషన్ల నిబంధన కొందరికే వర్తించగా, మరికొందరు వాటికి దూరంగా కోరుకున్నచోటే పని చేశారన్న చర్చ ఉంది. తాజాగా ఈ నిబంధన అమలుపై దృష్టిసారించిన అధికారులు.. వివిధ కేడర్‌లకు చెందిన వారి వివరాలు సేకరిస్తుండటం గమనార్హం. వివరాల సేకరణలో భాగంగా ప్రమోషన్‌కు ముందు లూప్‌లైన్‌లో పనిచేశారా? ఎన్ని సంవత్సరాలుగా ఒకే విభాగంలో కొనసాగుతున్నారు? ఒకే పట్టణం లేదా సబ్‌డివిజన్‌లో దీర్ఘకాలంగా ఉన్నారా? బదిలీల సమయంలో ప్రజాప్రతినిధుల సిఫార్సులు వినియోగించుకున్నారా? శాఖ నిర్ణయాలను సవాల్ చేసిన సందర్భాలున్నాయా? అనే అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ప్రజాప్రతినిధుల సిఫారసుల లేఖలు ఉన్నా.. సగం మందికి ఈసారి డిప్యుటేషన్‌లు తప్పవన్న చర్చ జరుగుతుండగా.. ఇంతకాలం డిప్యుటేషన్‌లతో కాలం వెళ్లబుచ్చుతున్న మరికొందరిలో ఠాణా పోస్టింగ్‌లు రావచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
డిప్యుటేషన్లకు దూరంగా ఉన్నవారి వివరాల సేకరణ
తెరపైకి లాఅండ్ ఆర్డర్ పోస్టింగ్‌ల గుట్టు
కమిషనరేట్‌లో సగంమంది
ఈసారి లూప్‌లైన్‌కే..


