నిధుల గోల్‌మాల్‌! | - | Sakshi
Sakshi News home page

నిధుల గోల్‌మాల్‌!

Jun 15 2026 7:28 AM | Updated on Jun 15 2026 7:28 AM

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ రెవెన్యూ కాలనీలోని ప్రకాశ్‌రెడ్డిపేటలో 2003లో స్థాపించిన పునీత మరియ వికాస పొదుపు పరస్పర సహాయక సహకార సంఘంలో నిధులు గోల్‌మాల్‌ జరిగిందని సభ్యులు ఆరోపిస్తున్నారు. సుమారు 600 మంది సభ్యులు ఉన్న ఈ సంఘంలో కోట్ల రూపాయల సభ్యుల నిధుల నిర్వహణపై పలు ప్రశ్నలు తలెత్తడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘంలోని కొంతమంది కమిటీ మాజీ ప్రతినిధులు తమ కుటుంబ సభ్యుల పేర్లపై భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రూ.లక్షల్లో తీసుకున్నారని విమర్శలు వస్తున్నాయి.

హ్యాండ్‌లోన్‌ పేరుతో..

ఒకే కుటుంబానికి చెందిన పలువురి పేర్లపై దాదాపు రూ.30 లక్షల వరకు రుణాలు మంజూరైనట్లు, మరికొందరు ప్రతినిధులు హ్యాండ్‌లోన్‌ పేరుతో లక్షల రూపాయలు తీసుకున్నట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద సుమారు రూ.2.50 కోట్ల మేర సభ్యుల నిధులు పక్కదారి పట్టించే ప్రయత్నం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రుణాల వివరాలు అధికారిక లెక్కల్లో పూర్తిగా కనిపించడం లేదని, కొన్ని ఆర్థిక లావాదేవీల కోసం వేర్వేరు రికార్డులు నిర్వహించారనే అనుమానాలను సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రశ్నిస్తే పూర్తిస్థాయి ఆర్థిక వివరాలు ఇప్పటివరకు అందించలేదని సభ్యులు చెబుతున్నారు.

సభ్యుల్లో సందేహాలు..

ఇటీవల నిర్వహించిన అత్యవసర సమావేశంలో కొన్ని బకాయిలు వసూలు చేసినట్లు సంఘం ప్రతినిధులు ప్రకటించారు. మొత్తం నిధులు తిరిగి సంఘం ఖాతాల్లో జమయ్యాయా లేదా అన్న విషయంపై సభ్యుల్లో సందేహాలు కొనసాగుతున్నాయి. పూర్తి లెక్కలను సభ్యుల ముందుంచాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. సంఘంలోని బాధిత సభ్యుల కథనం ప్రకారం..ఆర్థిక వ్యవహారాలపై ప్రశ్నలు లేవనెత్తిన వారిపై వ్యక్తిగత విమర్శలు, ఒత్తిళ్లు తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. కొందరికి ‘సంఘం నచ్చకపోతే వెళ్లిపోవచ్చు’ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని వారు వాపోతున్నారు. ఆటోడ్రైవర్లు, వాచ్‌మెన్లు, చిన్న ఉద్యోగులు, కూలీలు వంటి నిరుపేద వర్గాలకు చెందిన సభ్యులు తమ జీవితకాల పొదుపులను సంఘంలో పెట్టుబడిగా పెట్టామని, ఇప్పుడు వాటి భద్రతపై ఆందోళన చెందుతున్నామని చెబుతున్నారు. సంఘం ప్రారంభమైనప్పటి నుంచి మంచి పేరుతో నడిచిందని, ఇటీవల వెలుగుచూసిన ఆరోపణలతో సభ్యుల్లో అనిశ్చితి నెలకొందని పేర్కొంటున్నారు.

గతంలో అవకతవకలు వాస్తవమే:

సతీశ్‌రెడ్డి అధ్యక్షుడు

ఈ ఆరోపణలపై సంఘం ప్రస్తుత అధ్యక్షుడు సింగారెడ్డి సతీశ్‌రెడ్డిని వివరణ కోరగా.. గతంలో కొంత ఆర్థిక అవకతవకలు జరిగిన విషయం వాస్తవమేనని, అయితే వాటిలో అధిక భాగం రికవరీ చేసినట్లు తెలిపారు. వ్యవహారాన్ని కోర్టుల వరకు తీసుకెళ్లకుండా పరస్పర అవగాహనతో పరిష్కరించే ప్రయత్నం చేశామని చెప్పారు. తాను ఇటీవలే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించానని, ఇకపై సంఘం కార్యకలాపాలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. అన్ని వ్యవహారాలు నిబంధనల ప్రకారమే కొనసాగుతున్నాయని, గతంలో తలెత్తిన ఆర్థిక సమస్యలను సరిదిద్దే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. అయితే, సభ్యులు మాత్రం పూర్తి ఆడిట్‌ నివేదిక, రుణాల వివరాలు, రికవరీ అయిన నిధుల లెక్కలు బహిర్గ తం చేయాలని పట్టుబడుతున్నారు. అధికారుల పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని కోరుతున్నారు.

కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లే యోచన..

ఈవ్యవహారంపై కలెక్టర్‌, జిల్లా సహకార అధికారి దృష్టికి ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సభ్యులు తెలిపారు. సంఘం ఆర్థిక లావాదేవీలపై స్వతంత్ర విచారణ జరిపి, అవసరమైతే రికార్డులను స్వాధీనం చేసుకుని వాస్తవాలు వెలుగులోకి తేవాలని వారు కోరుతున్నారు.

సహకార సంఘంలో రూ.2.50 కోట్ల అవినీతి అక్రమాలు

రుణాలు తీసుకున్నారని కమిటీ మాజీ ప్రతినిధులపై ఆరోపణలు

లెక్కలు బహిర్గతం చేయాలని సభ్యుల డిమాండ్‌

కలెక్టర్‌, డీసీఓ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్న బాధితులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement