పెట్టుబడికి పైసల్లేవ్‌! | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడికి పైసల్లేవ్‌!

Jun 12 2026 7:25 AM | Updated on Jun 12 2026 7:25 AM

విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోలుకు

రైతులు అప్పు చేయాల్సిందే..

ఇంకా పెండింగ్‌లోనే ధాన్యం, మొక్కజొన్నల డబ్బులు

రూ.703 కోట్లకు రూ.461 కోట్లు మాత్రమే

ఖాతాల్లో జమచేసిన ప్రభుత్వం

మిగిలిన రూ.242 కోట్లు చెల్లించాలని

రైతుల విజ్ఞప్తి

సాక్షి, వరంగల్‌: వానాకాలం సాగు పనులు జోరందుకుంటున్న వేళ జిల్లాలో రైతులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. యాసంగి సీజన్‌లో విక్రయించిన ధాన్యం, మొక్కజొన్న పంటలకు సంబంధించి రైతులకు ఇంకా రూ.242 కోట్ల మేర చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన పెట్టుబడులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయాల్సి ఉండడంతో పాటు ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాల అద్దెలు, కూలీల ఖర్చుల కోసం రైతులు ప్రభుత్వ బకాయిల వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. రూ.42 కోట్ల ధాన్యం డబ్బులు, రూ.200 కోట్ల మొక్కజొన్నల డబ్బులు తమ ఖాతాల్లోకి వస్తే పెట్టుబడి ఇబ్బందులు తప్పుతాయంటున్నారు.

పంట విక్రయాల డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో చాలామంది రైతులు ప్రైవేట్‌ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందలేని చిన్న, సన్నకారు రైతులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకునే ప్రమాదం ఉందని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సాగు ప్రారంభ దశలోనే బకాయిలు చెల్లిస్తే రైతులు అప్పుల ఊబిలో పడకుండా వ్యవసాయ పనులను సకాలంలో పూర్తి చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది 2,75,500 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేయనున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం త్వరగా ధాన్యం, మొక్కజొన్నల డబ్బులు ఖాతాల్లో జమచేయాలని రైతులు కోరుతున్నారు.

దశలవారీగా డబ్బులు చెల్లిస్తున్నాం..

మొక్కజొన్నలను క్వింటాలుకు మద్దతు ధర రూ.2400కు కొనుగోలు చేశాం. ఇప్పటికే 16 కేంద్రాల నుంచి 1,27,312.7 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశాం. మొత్తంగా రూ.305 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా మే 27 నుంచి ఇప్పటివరకు రూ.105 కోట్లు చెల్లించాం. మిగిలినవి దశల వారీగా చెల్లిస్తున్నాం. సాధ్యమైనంత తొందరగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరుగుతాయి. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం.

– చంద్రశేఖర్‌గౌడ్‌, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement