● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
గీసుకొండ: కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు (కేఎంటీపీ) కోసం భూములిచ్చిన రైతులకు రాజీవ్ టౌన్‌షిప్‌లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి, సకల సౌకర్యాలు కల్పిస్తామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొనాయమాకుల వద్ద ఉన్న ఫంక్షన్‌హాల్‌లో కేఎంటీపీ రైతులకు భూ రిజిస్ట్రేషన్ పత్రాలను గురువారం పంపిణీ చేశారు. కలెక్టర్ సత్యశారద, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి హాజరైన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. టౌన్‌షిప్‌లో సౌకర్యాలు కల్పించడానికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.84 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. గీసుకొండ మండలంలో 511, సంగెం మండలంలో 355 మంది కేఎంటీపీకి భూములు ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు 155 మంది రైతులు ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నార న్నారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం రూ.2.17 కోట్లను భరిస్తోందని ఆయన విరించారు. తనతో పాటు కలెక్టర్ సత్యశారద, గీసుకొండ, సంగెం తహసీల్దార్లు ఎండీ రియాజుద్దీన్, రాజ్‌కుమార్ కృషి ఫలితంగా సీఎం రేవంత్‌రెడ్డి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని చెప్పారు. 50 గజాల్లోపు ప్లాట్లు పొందిన 183 మందికి 75 గజాల చొప్పున ఇంటి స్థలాన్ని టౌన్‌షిప్‌లో కేటాయించామని గుర్తు చేశారు. రూ.48.30 కోట్లతో టౌన్‌షిప్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నామని వివరించారు. ‘కుడా’ నుంచి రూ.2 కోట్లతో అదనంగా రెండు మండలాల్లో ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి సానుకూలంగా స్పందించగా ఆయనకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, తహసీల్దార్లు ఎండీ రియాజుద్దీన్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
విద్య, ఉపాధి అవకాశాలు మెరుగు
సంగెం: గ్రామీణ ప్రాంతవాసులకు విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఎంఎస్‌ఎంఈ, కేంద్రియ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఎల్గూర్‌రంగంపేట శివారు నర్సానగర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న సర్వేనంబర్ 648లోని ప్రభుత్వ స్థలాన్ని బుధవారం పరిశీలించారు. ఇందులో 20 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ, 10 ఎకరాల్లో కేంద్రియ విద్యాలయం నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీఓ రవీందర్, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


